హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే | Supreme Court stays Gauhati High Court order on CBI | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

Published Sun, Nov 10 2013 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. ఈ తీర్పును సాకుగా చూపి.. పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులు తమపై సీబీఐ దర్యాప్తు ఆపేయాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలో తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపేస్తున్నామని ప్రకటించింది. దీంతో సీబీఐ, కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నాయి. 1963లో నాటి కేంద్ర హోం శాఖ తీర్మానంతో సీబీఐ ఏర్పాటైందని, కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఏర్పడిన సీబీఐని పోలీసు దళంగా పరిగణించలేమని పేర్కొంటూ ఇటీవల గౌహతి హైకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నాటి కేంద్ర హోం శాఖ తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది. దీంతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకమైంది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. గౌహతి హైకోర్టు తీర్పుతో పలు కీలక కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) శనివారం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీన్ని తక్షణమే విచారించాలని కోరింది. దీన్ని ప్రత్యేక సందర్భంగా పరిగణించిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను శనివారం ఆయన నివాసంలో విచారించింది.
 
 నవేంద్ర కుమార్ వాదన తోసిపుచ్చిన కోర్టు..: గౌహతి హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ మీద సంచలన తీర్పునకు కారణమైన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి నవేంద్ర కుమార్ తరఫు న్యాయవాది కూడా ఈ విచారణకు హాజరయ్యారు. హైకోర్టులో తాము వేసిన కేసులో సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) ప్రతివాది కాదని, కాబట్టి ఆ శాఖ వేసిన అప్పీలును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో స్పందించాల్సింది సీబీఐ లేదా హోం శాఖ మాత్రమేనన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మీకు ఏమైనా అభ్యంతరాలుంటే.. రెండు వారాల్లోగా దాఖలుచేసే మీ స్పందనలో ఆ విషయాలు ప్రస్తావించండి. అప్పుడు వాటికి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్తుంది. వాటిని మేం పరిశీలిస్తాం’’ అని పేర్కొంది. సీబీఐ.. డీవోపీటీ పరిధిలోకి వస్తుందని, కాబట్టి అది తగిన శాఖేనని తెలిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) జీఈ వాహనవతి మాట్లాడుతూ.. సీబీఐ, హోం శాఖ ప్రత్యేకంగా తమ అప్పీళ్లను దాఖలు చేస్తాయన్నారు.
 
 స్టే విధించక తప్పదు..: ‘‘మీరు అసలు హైకోర్టులో తగిన ప్రతివాదులను ఇంప్లీడ్ చేయలేదు’’ అని నవేంద్ర కుమార్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మేం ఈ రోజు పేపర్లో చదివాం. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పలు కీలక కేసుల్లో నిందితులు తమ మీద సీబీఐ దర్యాప్తు నిలిపేయాలని కోరుతున్నారు. మీరూ చదివే ఉంటారు. మేం హైకోర్టు తీర్పుపై స్టే విధించక తప్పదు. మీ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించండి. మేం ప్రతిదాన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. స్టే ఇచ్చినంత మాత్రాన.. మేం మీ అభ్యర్థనను తోసిపుచ్చినట్లు కాదు’’ అని పేర్కొంది. పది నిమిషాల వాదనల అనంతరం.. గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి వాదనలను డిసెంబర్ 6కు వాయిదా వేసింది.
 
  హైకోర్టుది తప్పుడు నిర్ణయం: ఏజీ
 వాదనల సందర్భంగా ఏజీ వాహనవతి మాట్లాడుతూ.. తప్పుడు ప్రశ్నలు, తప్పుడు ఊహల ఆధారంగా గౌహతి హైకోర్టు తీర్పు వెల్లడించిందని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ(డీఎస్‌పీఈ) చట్టం.. సీబీఐకు వర్తించదని పేర్కొనడంలో అర్థం లేదన్నారు. ఈ సందర్భంలో ధర్మాసనం స్పందిస్తూ.. హోం శాఖ తీర్మానం చేశాక తదుపరి చర్యలేవీ ప్రభుత్వం తీసుకోలేదు కదా అని గుర్తుచేసింది. దీనిపై వాహనవతి మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పిన కారణాలేవీ సమంజసంగా లేవన్నారు. పరిపాలనా న్యాయ సూత్రాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఈ కేసులో ప్రాతినిధ్య చట్టం(డెలిగేటెడ్ లెజిస్లేషన్) అంశం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ప్రాతినిధ్య చట్టానికి(చట్టం ప్రకారం తమకు సంక్రమించిన అధికారాల మేరకు ఒక సంస్థ లేదా వ్యక్తి చేసే ఉప చట్టం), కార్యనిర్వాహక అధికారాలు దఖలు పరచడానికి తేడా ఉందన్నారు. వీటిని తాము పరిశీలించి.. పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. వాహనవతి మాట్లాడుతూ.. మొత్తం 9 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సీబీఐలో మొత్తం 6 వేల మంది దాకా ఉన్నారని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement