ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో పొగాకు వినియోగం తగ్గిందని ఈ మధ్య వచ్చిన సర్వేలతో సంబరపడ్డాం కానీ అదెంతో సేపు నిలవలేదు. సిగరెట్ తాగడానికి ఇప్పుడు వయసుతో పనిలేదు.. చిన్నపిల్లలు కూడా పెట్టెలు పెట్టెలు ఉఫ్ మని ఊదేస్తున్నారు. భారత్‌లో పొగతాగే అలవాటుపై గ్లోబల్ టొబాకో అట్లాస్ తాజా నివేదిక ప్రజారోగ్యం ఎలా గుల్లవుతోందా అన్న ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో పదేళ్లకే పొగతాగే అలవాటు మొదలవుతోందని ఆ నివేదిక వెల్లడించింది. అమెరికన్ కేన్సర్ సొసైటీæ, వైటల్ స్ట్రాటజీ అనే సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం మన దేశంలో 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 6.25 లక్షల మంది ప్రతీ రోజూ పొగతాగుతున్నారు. వారిలో 4,29,500 మందికి పైగా అబ్బాయిలు ఉంటే, లక్షా 90 వేల మంది అమ్మాయిలు ఉన్నారు.
15 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతీ రోజూ 10 కోట్ల 30 లక్షల మంది పొగాకు పీలుస్తూ దానికి బానిసలుగా మారారు. వీరిలో పురుషులు 9 కోట్లు, మహిళల సంఖ్య కోటి 30 లక్షలుగా ఉంది. పొగాకు వినియోగంతో కాలిబూడిదైపోతున్న కుటుంబాలకు లెక్కే లేదు. ఈ అలవాటు వల్ల సంక్రమించిన వ్యాధులతో ప్రతీ ఏడాది 9 లక్షల 32 వేల 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఒక వారంలోనే దేశవ్యాప్తంగా 17,887 మృతుల సంఖ్య నమోదవుతోంది. ఇక పొగాకు ఉత్పత్తుల వినియోగం ద్వారా మనకు జరిగే ఆర్థిక నష్టం ఊహించలేనిది. పొగాకు ఉత్పత్తులపై పెడుతున్న ఖర్చుతో పాటు, దానివల్ల తలెత్తే కొన్ని రకాల కేన్సర్‌లు, ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం భారత్ ఇంచుమించుగా 2 లక్షల కోట్లు ఖర్చు భారాన్ని మోయాల్సి వస్తోంది. మన దేశంలో 2016 సంవత్సరంలో 8 వేల 200 కోట్లకు పైగా సిగరెట్లు ఉత్పత్తి అయ్యాయి. పొగాకు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే జాతీయ స్థూల ఆదాయంలో 15 శాతం పొగాకు ఉత్పత్తుల ద్వారా లభిస్తుండడంతో ప్రభుత్వాలు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment