స్వాతంత్య్రానికి ముందు బాంబే, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమై కేవలం 12 మంది మాత్రమే చిన్నపిల్లల వైద్య నిపుణులు దేశవ్యాప్తంగా సేవలు అందించినట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇటీవల వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్న పిల్లల వైద్యులు 50 వేల మంది వరకు ఉండొచ్చని అకాడమీ అంచనా. ఏటా సుమారు 1500 మంది చిన్నపిల్లల వైద్యంలో డిగ్రీలు పొందుతున్నారు. అయినప్పటికీ పది వేల జనాభాకు ఒక చిన్న పిల్లల వైద్యులు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
భారతదేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధమైన దశలోనూ జనాభాలో 40 శాతం మందిగా ఉన్న 47 కోట్ల మంది పిల్లల ఆరోగ్య సంరక్షణ అంతంత మాత్రం పురోగతి తోనే ఉంది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. 2021 అక్టోబరు నాటికి మన దేశంలో 33 లక్షల మంది పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం ఉంది. చిన్నారుల మరణాల్లో 70 శాతం ఈ కారణాల వల్లనే సంభవిస్తున్నాయి. 2018–2050 మధ్య ప్రపంచంలో 200 కోట్ల జననాలు సంభవించవచ్చని యునిసెఫ్ అంచనా వేసింది.
అందులో ఐదో వంతు భారత్‌లోనే జన్మించే అవకాశం ఉంది. అందుకని శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటి నుంచే భరోసా కల్పించే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు పరచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు మనం చైనాను ఆదర్శంగా తీసుకోవచ్చు. చిన్న పిల్లల మరణాలను చైనా సమర్థంగా అదుపు చేయగలిగింది. నాణ్యమైన వైద్య సేవలను అందించడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించింది. అదే బాటలో మనమూ పయనించాలి. ఆరోగ్యవంతమైన రేపటి భారత్ కోసం చక్కటి ఆరోగ్య బాటను ఏర్పరచాలి.
Comments
Please login to add a commentAdd a comment