ఐఐటి ఖరగ్ పూర్ విద్యార్థికి బంపర్ ఆఫర్
మరో ఐఐటీ విద్యార్థి బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నాడు. బీహార్ ఖగరియాకి చెందిన వాత్సల్య సింగ్ చౌహాన్ (21) ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. ఐఐటీ ఖరగ్పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అతనికి మైక్రోసాఫ్ట్ సంస్థ సంవత్సరానికి కోటీ రెండు లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. మధ్యతరగతి కుటుంబానికి వాత్సల్స సింగ్ చౌహాన్ తండ్రి వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండడం విశేషం.
కాగా వాత్సల్య సింగ్ ఐఐటీ-జేఈఈలో ఆలిండియా స్థాయిలో 382వ ర్యాంకు సాధించి.. ప్రస్తుతం ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభతో రాణించాడు. దాంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాత్సల్య సింగ్కు ఏడాదికి కోటి రెండు లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. విద్యా సంవత్సరం అనంతరం అతను ఉద్యోగంలో చేరనున్నాడు. ఐదు రౌండ్ల ఇంటర్వ్యూ అనంతరం తాను ఉద్యోగానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని వాత్సల్య తెలిపాడు. ఈ విషయాన్ని మొదట తాను, తన కుటుంబం నమ్మలేకపోయామని చెప్పాడు.
కాగా చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న వాత్యల్యను పెద్ద చదువులు చదివించేందుకు కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు. పదో తరగతి వరకు హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాత్సల్య ఇంటర్‌లో 75శాతం మార్కులు సాధించాడు. ఐఐటీలో చోటు సంపాదించుకొనేందుకు రాష్ట్రంలోని కోట పట్టణంలోని ప్రముఖ కోచింగ్ సంస్థలో కోచింగ్ తీసుకున్నాడు.
వాత్సల్యకు మైక్రో సాఫ్ట్ జాబ్ రావడంపై తండ్రి చంద్రకాంత్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కొడుకు చదువు నిమిత్తం మూడున్నర లక్షలు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నానని.. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. అయితే ఎక్కువగా స్కాలర్ షిప్ లమీద ఆధారపడే చదువుకున్నాడని , అతని ఉపాధ్యాయులు కూడా చాలా సహాయం చేశారంటూ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.