
భారీ వర్షాలు, వరదలతో కేరళ, కర్ణాటక, మహారాష్ట రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ప్రజలు సర్వం కోల్పోయి సహాయక కేంద్రాల్లో కిక్కిరిసిపోతున్నాయి. వరద విపత్తు బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి.
కేరళలో వరదల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాయనాడ్, మలప్పురం తదితర ప్రాంతాల్లో అనేక చోట కొండచరియలు విరిగి పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీభత్స వాతావరణం నెలకొంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. సర్వం కోల్పోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాదిమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇంత కష్టంలోకూడా కేరళలోని రాజాకట్టకు చెందిన అశోకన్ అనే రైతు ఆదర్శవంతంగా నిలిచారు. సర్వం కోల్పోయినా మంచినీ, మానవత్వాన్నీ కోల్పోలేదు. వరద ధాటికి తోటలో వెయ్యికి పైగా అరటి చెట్లు నిట్టనిలువునా కుప్ప కూలిపోయాయి. చేతికొచ్చిన బంగారంలాంటి పంట సర్వ నాశనమైపోయింది. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా గుండె చెరువు అవ్వక మానదు. ఇక ఆ రైతు పరిస్థితిని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
అయితే తన దాతృత్వంతో మనిషిగా అందనంత ఎత్తున నిలిచారు. ప్రకృతి ప్రకోపానికి కూలింది చెట్లే కానీ, తాను కాదంటూ పెద్దమనసు చాటుకున్నారు. తన దగ్గర మిగిలిన కొద్దిపాటి అరటిపళ్లను, పనసకాయలు తదితరాలను బాధితులకివ్వమంటూ స్థానిక మీడియా సిబ్బందికి అందించారు. తన దగ్గర ఇంతకంటే ఏమీ మిగల్లేదని వాపోయారు. న్యూస్18 ప్రతినిధి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి.