
కర్షకుడికి కడుపు మండి కన్నెర్ర చేస్తున్నాడు. తాను చేస్తున్న పని నుంచి ‘సెలవు’ (లీవ్) తీసుకోవడంతో పాటు మార్కెట్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అంతే కాదు వచ్చే జూన్‌నెలలో పదిరోజుల పాటు ఆహారధాన్యాలు, కూరగాయలు, పాల వంటి నిత్యావసరాలను వినియోగదారులకు అమ్మకూడదని తీర్మానించారు.
ఎందుకు ?
రుణమాఫీతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు. ఈ డిమాండ్లపై గత నెల 23న దేశరాజధాని ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించాలనే రైతుసంఘాల ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త ఉద్యమాన్ని చేపట్టడంలో భాగంగా జూన్ 1 నుంచి మార్కెట్లలో పాలతో సహా కూరగాయలు, ఆహారధాన్యాలేవీ అమ్మకూడదని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఈ మేరకు ఆందోళనలు నిర్వహించనున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని రైతుసంఘాలకు భిన్నంగా హరియాణా రైతులు రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ నాయకత్వంలో ‘సెలవుపై రైతులు’ (కిసాన్ అవ్‌కాశ్) చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిరసనల్లో భాగంగా తమ తమ గ్రామాల్లో ధర్నాలు చేపట్టడంతో పాటు మార్కెట్‌లో ఏ వస్తువు కూడా అమ్మకూడదని, ఏదీ కొనకూడదనే నిర్ణయానికి వచ్చారు.
ఏకగ్రీవ నిర్ణయం...
రైతుసంఘాల భేటీలో ‘కిసాన్ అవ్‌కాశ్’పై ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు. కనీసం పదిరోజుల పాటు నిరసనలు కొనసాగించి, పొడిగింపుపై నిర్ణయిస్తారు.. మహాసంఘ్‌లోని ఏడు రైతు సంఘాల్లోని సభ్యులతో పాటు ఇతర రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొంటారు. శాంతియుత పద్ధతుల్లో నిరసనల ద్వారా తమ ఐకమత్యాన్ని నిరూపించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment