విశ్లేషణ
తమ డిమాండ్ల సాధనకు నాసిక్ నుంచి 180 కిలోమీటర్ల దూరం నడిచివచ్చిన రైతులు ముంబై నగరంలో ట్రాఫిక్‌కు, పదోతరగతి పరీక్షలకు అంతరాయం కలగకుండా గొప్ప సంయమనం ప్రదర్శించారు.
ముంబైకి హృదయం అనేది లేదని, పూర్తిగా నింపిన లేక మరొక రూపంలోని పర్సులు మాత్రమే అక్కడ ఉంటాయని నానుడి. కానీ సోమవారం అర్ధరాత్రి వేలాదిమంది రైతులతో కూడిన సమూహం తమకు డిమాండ్లతోపాటు గొప్ప మనసు కూడా ఉన్నట్లు చాటుకుంది. తమ డిమాండ్ల సాధనకు మహారాష్ట్ర శాసనసభను ముట్టడించాలనే లక్ష్యంతో వచ్చిన ఈ రైతులు ముంబై నగరంలోకి పగటిపూట భారీ ప్రదర్శన చేస్తూ అట్టహాసంగా రావడానికి బదులుగా సుదూరంలోని శివారు ప్రాంతం నుంచి అర్ధరాత్రిపూట మేల్కొని నిశ్శ బ్దంగా నడుస్తూ నగరాన్ని చేరుకున్నారు. ఎందుకంటే వారు ముంబై నగర ప్రజలను ఇబ్బంది పెట్టాలని భావించలేదు. కారణం.. పిల్లలు తమ పరీక్షలు రాయడానికి అది ఇబ్బంది కలిగిస్తుందని వారు భావించారు.
దాదాపు 30 వేలకు పైబడిన రైతుల సుదీర్ఘ ర్యాలీతో ఎలా వ్యవహరించాలో అర్థం కాని స్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడింది. ఈ నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులకు గురి కాకుండా తమ పరీక్షలకు హాజరవడానికి కాస్త త్వరగా బయలు దేరాలని రైతులు కోరారు. కానీ తాము ముందుగా అనుకున్నట్లుగా రద్దీసమయంలో నగరంలోకి ఊరేగింపుగా రావడాన్ని ఆపుకుని అనేక గంటల ముందుగా రాత్రిపూటే రైతులు నగరానికి చేరుకున్నారు.
రైతుల డిమాండ్లు తక్కువగా మాత్రం లేవు. అలాగని వారు దురాశాపరులేమీ కాదు. గత కొంత కాలంగా మన వ్యవస్థ రైతుల జీవనాధారాన్ని కొల్లగొట్టి వారిని తీవ్ర కష్టాల పాలు చేస్తూవచ్చింది. ముంబైకి 160 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ నుంచి రైతుల లాంగ్ మార్చ్ మొదలైంది. వామపక్షానికి చెందిన అఖిల భారత కిసాన్ సభ దీన్ని నిర్వహించింది.
రోజు తర్వాత రోజు వారు ప్రధాన రహదారి గుండా కొన్ని ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు కూడా చేయకుండా నడుచుకుంటూ వచ్చారు. అయితే వారి నిశ్శబ్దమే గట్టిగా సవ్వడి చేస్తూవచ్చింది. ముంబై మీడియా అయితే రైతుల యాత్రను పెద్దగా పట్టించుకోలేదు. మొబైల్ ఫోన్‌లో ఈ యాత్ర గురించిన ఫొటోను తీసి సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేయడం తప్ప మీడియా పెద్దగా స్పందించలేదనే చెప్పాలి.
కానీ రైతుల ర్యాలీ ఠాణే చేరుకున్నప్పుడు మాత్రమే మీడియా మేల్కొంది. ఆ ఊరేగింపు ముంబై నగరానికి వస్తే ట్రాఫిక్‌కి బాగా ఇబ్బంది కలుగుతుంది. ట్రాఫిక్‌కి అంతరాయం కలగడమే ఊరేగింపు విజయానికి కొలమానం కదా. కాబట్టే మీడియా ఒకవిధమైన చికాకుతో ఠాణే వద్ద ఖాళీ గస్తీ పోస్టు వద్ద టీవీ చర్చను నిర్వహించింది. ఆ ఒక్క టీవీ యాంకర్ కూడా అసలు రైతులు ఎందుకు మార్చ్ చేస్తున్నట్లు అని ప్రశ్నించడం గమనార్హం.
తాము పాదయాత్ర ఎందుకు తలపెడుతున్నామో చెబుతూ నిర్వాహక సంస్థ చాలా ముందుగానే డిమాండ్ల జాబితాను ప్రచురించింది. వాటిలో బేషరతుగా రుణ మాఫీ చేయడం, ముంబై–నాగపూర్ సూపర్‌ఫాస్ట్ హైవే నిర్మాణం కోసం భూ సేకరణను నిలిపివేయడం, రైతు సమస్యలపై స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయడం. 12 ఏళ్ల క్రితం చట్టంగా తీసుకొచ్చిన అటవీ భూములపై హక్కులను తమ పేరుమీద దఖలు పర్చ డం, ప్రజాపంపిణీ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించడం వంటివి కొన్ని డిమాండ్లు.
సోమవారం ఉదయం ముంబై నగరవాసులకు మహాశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆందోళనాకారులు కొత్త బాట పట్టారు. సుదీర్ఘ ర్యాలీ పొడవునా నడుచుకుంటూ వచ్చిన రైతులు నాసిక్ నుంచి ఠాణే హైవేలో కూడా తమ ఊరేగింపుతో ట్రాఫిక్‌కు బాగా అంతరాయం కలగడం చూశారు. దాంతో వారు ముంబైని కాస్త కరుణించాలని నిర్ణయించుకున్నారు. రైతులు పెద్దమనసుతో వ్యవహరించారనే చెప్పాలి.
ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలివైన ప్రజా సంబంధాల నిర్వహణా వ్యూహం కావచ్చు. దీంతో ప్రభుత్వం ఈ ర్యాలీని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. రైతులు ఠాణేను దాటి రాకముందే ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల డిమాండ్లపై తాను సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. కానీ ఒక విషయం మాత్రం వివరణ లేకుండా అలాగే ఉండిపోయింది.
రైతులు ఇంత సుదీర్ఘంగా తారురోడ్డు మీద నడుచుకుంటూ రాకుండా ముఖ్యమంత్రి తగు చర్యలు ఎందుకు చేపట్టలేదు? ర్యాలీలో పాల్గొన్న రైతుల్లో కొందరు ఎంత పేదవారంటే వారికి కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేవు. రైతులను అలా ఇబ్బంది పెట్టడానికి బదులుగా సీఎం తన అధికారులను ర్యాలీ మొదలైన నాసిక్ వద్దకే పంపించాల్సి ఉండింది. లేదా తానే స్వయంగా అక్కడికి వెళ్లి రైతులను కలిసి ఉండాల్సింది. వారి డిమాండ్లు కొత్తవేమీ కాదు. అయితే అనేక డిమాండ్లను వారు కలిపేశారు. ఇక రుణమాఫీ విషయంలో ప్రభుత్వ నిజాయితీ అనుమానాస్పదంగానే ఉంది.
రైతు ర్యాలీపట్ల ప్రజానీకంలో ఏర్పడిన సానుభూతి, ముంబైకి ర్యాలీ చేరుకున్న తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు వారిని కలిసి మద్దతు పలకడం వంటివి బీజేపీని కాస్త కదిలించాల్సి ఉంది. చివరకు కలిసి ఉంటూనే పోరుకు దిగుతున్న శివసేన సైతం రైతుల ర్యాలీకి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా గతంలో వామపక్షాన్ని ఎర్ర కోతులుగా అభివర్ణిస్తూ వచ్చిన బాల్ థాక్రే వ్యాఖ్యను మళ్లీ మననం చేసుకోవాల్సి ఉంది.
మహేశ్ విజాపుర్కర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment