సునంద పుష్కర్ మృతికి ముందు, తర్వాత ఆసక్తికర అంశాలు!
- అక్టోబర్ 2009లో ఓ పార్టీలో సునంద, థరూర్ లు కలుసుకున్నారు. థరూర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత 2010లో సునంద, థరూర్ లు పెళ్లి చేసుకున్నారు.
- గతంలో థరూర్ తిలోత్తమ ముఖర్జీని పెళ్లి చేసుకోగా, సునంద సంజయ్ రైనా అనే కాశ్మీరీని పెళ్లి చేసుకున్నారు. అయితే థరూర్, సునందలు తొలి వివాహానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత ఐక్యరాజ్యసమితిలో సేవలందిస్తుండగా సహ ఉద్యోగి క్రిస్టా జైల్స్ ను వివాహం చేసుకున్నారు.
- 2010లో ఐపీఎల్ లో కోచి జట్టును సునంద కొనుగోలు చేయడం వెనుక 70 కోట్ల అవినీతి జరిగిందనే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
- సునంద పుష్కర్ 2014 జనవరి 17 తేదిన ఢిల్లీలోని హోటల్ లీలాలోని నంబర్ 345 గదిలో మరణించింది.
- సునంద పుష్కర్ మధ్యాహ్నం 3.30 గంటలకు చివరిసారిగా కనిపించింది. సునంద మరణించినట్టు రాత్రి 9 గంటల ప్రాంతంలో శశి థరూర్, ఇద్దరు హోటల్ సిబ్బంది గుర్తించారు.
- సునంద మృతదేహంపై 12 గాయాలున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఆ గాయాలు ప్రాణాంతకం కాదని చెప్పడం అనేక సందేహాలు రేకెత్తాయి. సునందపై దాడి జరిగిందా అనే అనుమానాలు తలెత్తాయి.
- సునంద మరణించడానికి ముందు రోజు పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో గొడవ జరిగినట్టు తెలిసింది. శశి థరూర్, మెహర్ తరార్ ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందనే విధంగా సునంద ట్విటర్ లో సందేశాల్ని పోస్ట్ చేశారు.
- సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదు. హత్యే అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. సునంద మరణం తర్వాత థరూర్ తీరుపై సుబ్రమణ్య స్వామి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రష్యాలో తయారైన విషం కారణంగానే సునంద మరణించిందని స్వామి అన్నారు.
- సునంద మరణంపై మూడవ అభిప్రాయాన్ని సేకరించాలని ఢిల్లీ పోలీసులు సూచించడం అనేక సందేహాలకు తెరతీసాయి. ఏయిమ్స్, సీఎఫ్ఎస్ఎల్ నివేదికల మధ్య పొంతన లేకపోవడంతో మరో నివేదిక అవసరమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆమెది సహజ మరణం కాదని ఫోరెన్సిక్ నిపుణులు పలు విధాలు అనుమానాలు వ్యక్తం చేశారు.
- సునంద మృతిపై అనేక సందేహాలున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికి.. యూపీఏ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ కేసును మరుగునపడేసేందుకు అనేక ఒత్తిడులు వచ్చాయని విమర్శలు చెలరేగాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే కొన్ని వాస్తవాలు వెలుగు చూడలేకపోయాయని వార్తలు వెలువడ్డాయి.