మధ్యప్రదేశ్లో దొంగలు రెచ్చిపోయారు. మాందాసౌర్ గ్రామంలో చోరీకి యత్నించిన వ్యక్తులను అడ్డుకోవడంతో పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు ముగ్గురు దొంగలను పట్టుకొని కొట్టిచంపారు
భోపాల్: మధ్యప్రదేశ్లో దొంగలు రెచ్చిపోయారు. మాందాసౌర్ గ్రామంలో చోరీకి యత్నించిన వ్యక్తులను అడ్డుకోవడంతో ఆదివారం రాత్రి పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. తమను అడ్డుకున్న గ్రామస్తులపై దొంగలు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పిల్లవాడు సహా, అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామస్తులు ముగ్గురు దొంగలను పట్టుకొని కొట్టిచంపారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలో మోహరించారు.
పోలీసు ఉన్నతాధికారులు అందించిన సమాచరం ప్రకారం.. మాందాసౌర్ గ్రామంలో దొంగతనానికి ఎగబడిన వ్యక్తులను గ్రామస్తులు గమనించారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. బీభత్సం సృష్టించిన ఈ ఘటనలో అయిదుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక పిల్లవాడు కూడా ఉండడంతో స్థానికులు సహనాన్ని కోల్పోయారు. దొంగలను పట్టుకొని తీవ్రంగా కొట్టడంతో ముగ్గురు దొంగలు అక్కడిక్కడే చనిపోయారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు నేరస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని ఎస్పీ మనోజ్ శర్మ తెలిపారు. గాయపడిన గ్రామస్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.