ఎయిరిండియా విమానంలో మంటలు.. దారిమళ్లింపు
ముంబై నుంచి అమెరికాలోని నెవార్క్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. దాని కార్గో విభాగంలో మంటలు వచ్చినట్లు అలారం రావడంతో ఈ తెల్లవారుజామున దాన్ని దారిమళ్లించి, కజకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బోయింగ్ 777 తరహాకు చెందిన ఈ విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. విమానాన్ని ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు విమానంలో మంటలు గానీ, పొగ గానీ కనిపించలేదని అంటున్నారు.
'ఆపరేషనల్ కారణాల' వల్లే విమానాన్ని దారి మళ్లించినట్లు ఎయిరిండియా ఓ ట్వీట్‌లో పేర్కొంది. ముంబై విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 2.25 గంటల సమయంలో ఈ విమానం టేకాఫ్ అయింది. ఉదయం 8 గంటలకు కజకిస్థాన్‌లో ల్యాండయింది. ఒక్కోసారి కార్గో విభాగంలో ఉండే కొన్ని వస్తువుల కారణంగా కూడా అలారం రావొచ్చని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. సాంకేతిక పరంగా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే విమానాన్ని నెవార్క్‌కు పంపాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తామన్నారు. అత్యవసరం అయితే ప్రయాణికులను తరలించేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో మరో విమానాన్ని, ఇంజనీర్ల బృందాన్ని సిద్ధంగా ఉంచారు.
AIUpdate: #AI191 #Mumbai - #Newark has been diverted to #Kazakhstan due to operational reasons. All pax are being taken care of.
— Air India (@airindiain) 25 August 2016