అమర్‌నాథ్ యాత్ర ఆరంభం
జమ్మూ: పటిష్ట భద్రత నడుమ 48 రోజులపాటు సాగే అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో డిఫ్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ మొదటి విడతగా 1,282 మంది యాత్రికులను దక్షిణ కశ్మీర హిమాలయాలకు పంపించారు. దీనికి ఉన్న రెండు దారుల్లో 20 వేల మంది భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంత పరిరక్షణ కోసం డ్రోన్‌లు కూడా ఉపయోగిస్తున్నా రు. మొదటి విడత యాత్రికుల్లో 900 మంది పురుషులు, 225 మంది మహిళలు, 13 మంది పిల్లలు, 144 మంది సాధువులు ఉన్నారు. వీరు 33 వాహనాల్లో ఉదయం 5 గంటలకు అక్కడికి బయలుదేరారు.
వీరికి సీఆర్‌పీఎఫ్ బలగాలు రక్షణగా వెళ్లాయి. ‘భం భం భోలే’ నాదాలు చేస్తూ, పాటలు పాడుతూ వీరు భగవతి నగర్ బేస్‌క్యాంపుకు చేరుకున్నారు. భూమికి 3,888 మీటర్ల ఎత్తులోని పహగళం, బల్తా ల్ బేస్ క్యాంపులకు బయలుదేరారు. జూన్ 25న అక్కడ జరిగిన తీవ్రవాదుల దాడిలో 8 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా 21 మంది గాయపడ్డా రు. ఇక్కడి భద్రతా ప్రమాణాలను పరీక్షించడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. అదే సమయంలో అక్కడి ‘మంచు లింగాన్ని’ కూడా ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియ సేథీ, బీజేపీ ఎంపీ జంగల్ కిశోర్, నిర్మల్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) ఈ పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాయని తెలిపారు.