అనవసరంగా గర్భం రాకూడదనుకుంటే ఆడవాళ్లకు టూబెక్టమీ ఆపరేషన్ సహా పలు మార్గాలు ఉన్నాయి. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, నిరోధ్‌లు. టూబెక్టమీ మినహా మిగతా అన్నింటి వల్ల మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మగవాళ్లకు వాసెక్టమీ ఆపరేషన్‌తోపాటు నిరోధ్‌లు ఉన్నాయి. నిరోధ్‌ల వల్ల భావ సంతప్తి కలగదనే భావం చాలా మందిలో ఉండడంతో ఆడవాళ్లకు తరహాలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల కోసం భారత పరిశోధకులు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. చివరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ దిశగా 13 ఏళ్లపాటు ప్రయోగాలు నిర్వహించి ఇప్పుడు విజయం సాధించింది.
గర్భ నియంత్రణ కోసం మగవాళ్లకు ఓ ఇంజెక్షన్‌ను కనిపెట్టింది. ఈ ఇంజెక్షన్‌ను వరి బీజాలకు ఇస్తారు. అందుకు నొప్పి తెలియకుండా అనెస్తీసియా ఇవ్వాల్సి ఉంటుంది. వరి బీజం నుంచి వీర్యం బయటకు రాకుండా ఈ ఇంజెక్షన్ అడ్డుకుంటుందని సీనియర్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. చట్టబద్ధమైన మూడు ట్రయల్స్‌ను ఐసీఎంఆర్ విజయవంతంగా పూర్తి చేసిందని పాతికేళ్లపాటు ఈ విషయంలో పరిశోధనలు సాగించిన శర్మ చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి లాంఛనంగా భారత్ లైసెన్స్‌తోపాటు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్’ అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. మరో ఆరు నెలల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది.
అమెరికాలాంటి దేశాల్లో మహిళలు గర్భం రాకుండా 70శాతం మంది మాత్రలు, ఇంజెక్షన్లు వాడుతున్నారు. 22 శాతం మహిళలు టూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. భారత్‌లో 50 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక మందులు, ఇంజెక్షన్లు వాడుతుండగా, మిగతా మహిళల్లో ఎక్కువ మంది మగవారి నిరోధ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఏ నిరోధక సాధనాలను వాడని స్త్రీ, పురుషులు కూడా భారత్‌లో గణనీయంగా ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు కనుగొన్న ఇంజెక్షన్ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ప్రపంచంలో గర్భ నిరోధానికి మగవారికి ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెడుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతోందని డాక్టర్ శర్మ తెలిపారు. 303 మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వగా 97.3 శాతం మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment