శ్రీనగర్: చాలాకాలం తర్వాత మరోసారి జమ్మూకాశ్మీర్లో వరదల అలజడి నెలకొంది. ఆదివారం భారీగా కురిసిన అకాల వర్షంకారణంగా అక్కడి జీలం నది వరద నీటి ప్రవాహంతో పోటెత్తింది. శ్రీనగర్లోని సంగం ప్రాంతంలో ఈ నది కనీస నీటిమట్టాన్ని దాటి దిగువ ప్రాంతాలకు భారీగా వరద రూపంలో ప్రవేశించింది. రోడ్లమీదకు వచ్చి రాకపోకలకు అంతరాయం కలిగించింది. దీంతో ఆదివారం అర్థరాత్రి తర్వాత అప్రమత్తత ప్రకటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే జీలం ఉగ్రరూపంతో ప్రవహిస్తుందని, ఇది మరింత ప్రమాదంగా మారవచ్చని అధికారులు ప్రకటించారు. ప్రస్తుత వర్షం ఆగిపోయినా మరో ఆరు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వారమంతా ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాలన్ని తేమగా ఉండొచ్చని, వచ్చేవారానికి సాధారణ స్థితికి రావొచ్చని తెలిపారు. జీలం నది ఉదయం ఆరుగంటలకు సంగం, రామ్ మున్షి బాగ్లో 22.4 అడుగులు, 18.8 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.
సాధారణంగా ఈ ప్రాంతాల్లో 21, 18 అడుగల మేర ప్రవహిస్తేనే ప్రమాద పరిస్థితిని ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి మఫ్తీ మహ్మద్ సయీద్ మొత్తం పరిస్థితిని పరిశీలించి అధికారులతో అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిందిగా ఆదేశించారు. కాశ్మీర్ యూనివర్సిటీలో సోమవారం, మంగళవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. సహాయక చర్యల కోసం ముందస్తుగా నాలుగు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపించారు. ఒక్కో బలగంలో 50 మంది ఉంటారు.
కాశ్మీర్లో జీలం ఉగ్రరూపం
Published Mon, Mar 30 2015 9:32 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement