
కేరళలో 1924లో వరద బీభత్సం (ఫైల్)
కొచ్చి: మహా విలయం చుట్టుముడితే అది మిగిల్చిన కల్లోలం నుంచి బయటపడడం పెను సవాలే. అయితే కేరళ తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. అన్ని వైపుల నుంచి వచ్చిన సాయంతో పాటు కేరళీయుల మనోస్థైర్యంతో వరద కష్టాలకు ఎదురొడ్డి నిలిచింది. నిరాశలో కూరుకుపోకుండా ప్రజల ప్రాణాల్ని కాపాడుకునేందుకు పోరాట పటిమ ప్రదర్శించింది. రాష్ట్రపాలకులకు, నాయకత్వానికీ ఈ విపత్తు పెద్ద సవాల్! మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్రీకరించి, సైనికదళాల సాయంతో సహాయక చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి విజయన్ కృతకృత్యులయ్యారు.
అప్రమత్తతతో సాహసోపేతమైన సహాయక చర్యలు చేపట్టడం వల్ల వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు, చిన్నారులనూ కాపాడారు.వరద విలయాన్ని ఎదుర్కోవడంలో కేరళ ప్రజల పాత్ర అనన్యసామాన్యం. వైద్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇలా ఎవరికి తోచిన సాయం వారందించారు.
బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అహోరాత్రులు శ్రమించారు. వరదల్లో చిక్కుకున్న గర్భిణులు, చిన్నారుల్ని భుజాలకెత్తుకుని తీసుకెళ్ళారు. స్వచ్ఛంద కార్యకర్తలెందరో అహోరాత్రులు శ్రమించి కేరళ ప్రజల్లో దాగున్న పోరాటపటిమను చాటిచెప్పారు. వరద సాయంలో కేరళ మత్స్యకారుల పాత్ర మరువలేం. సొంత ఖర్చుతో వరద ప్రాంతాలకు చేరుకొని తమ శరీరాలను మెట్లుగా మలిచి ఎందరినో కాపాడారు.
1924 విలయాన్ని తట్టుకుని..
కేరళ మట్టిలోనే పోరాడే శక్తి ఉంది. అక్కడి ప్రభుత్వం, ప్రజలు సమైక్యంగా వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్న తీరు 1924లో కేరళని అతలాకుతలం చేసిన విలయాన్ని గుర్తుకు తెస్తుంది. 1924లో కేరళని ముంచెత్తిన వరదలు కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.
మృతుల సంఖ్యపై సరైన లెక్క లేకపోయినా ఆ వరదల్లో వేల మంది మరణించారు. లక్షల మంది శిబిరాల్లో తలదాచుకున్నారు. ఆ ఏడాది ప్రభుత్వం పన్నులు రద్దుచేసింది. వ్యవసాయ రుణాల కోసం నిధులు కేటాయించింది.. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఇళ్ళనిర్మాణం కోసం ఆర్థిక సాయం, వెదురును ఉచితంగా సరఫరా చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో కేరళ మళ్లీ కోలుకుంది.