
రియాల్టీ షో కోసం బాలుడిని..
న్యూఢిల్లీ: పాపులర్ రియాల్టీ షోలో పాల్గొనేందుకు.. ఇద్దరు మైనర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. 13 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, నిర్దాక్షిణ్యంగా హత్యచేశారు. అనంతరం ఆ బాలుడి తండ్రిని 60 వేల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విషయం వెలుగు చూసింది.
ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి రాంధ్వా చెప్పిన సమాచారం ప్రకారం..17 ఏళ్ల అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఒక రియాల్టీ షో లో పాల్గొనేందుకు ముంబై వెళ్లాలనుకున్నారు. దీనికి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే కోరికతో ఇద్దరూ కలిసి పథకం పన్నారు. డ్యాన్స్ షోకు వెళదామంటూ 13 ఏళ్ల స్వప్నేష్ గుప్తాకు మాయమాటలు చెప్పి నమ్మించారు. సెప్టెంబర్ 16న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు. అక్కడ ఒక రాత్రి మరో స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నారు. అక్కడికి సమీపంలోని రాణిఖేత్ కొండపైకి తీసుకెళ్లి బెల్టుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని కొండ పైనుంచి కిందికి తోసేసి, రెండురోజుల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చేశారు. తమ ప్లాన్లో భాగంగా రూ. 60 వేలు కావాలని స్నప్నేష్ తండ్రిని డిమాండ్ చేశాడు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ కాల్స్ ఆధారంగా కేసును ఛేదించారు.