
లక్నో : బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌నాథ్‌సింగ్ ‘సూర్య’గురువారం ఉదయం మరణించారు. వయో సంబంధిత సమస్యలతో 82 ఏళ్ల సింగ్ గోమతీనగర్‌లోని ఆయన నివాసంలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో 1937 మే 8న ఆయన జన్మించారు. సింగ్ మృతికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి జర్నలిజానికి తీరనిలోటని అన్నారు. 1960లో గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసిన ఆయన 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
బాల్యంలో ఆరెస్సెస్‌లో చేరిన ఆయన అనంతరం ప్రాంతీ య ప్రచారక్ స్థాయికి ఎదిగారు. అనంతరం ప్రచారక్ అయ్యారు. హిందుస్థాన్ సమాచార్‌లో ఆయన జర్నలిజం కెరీర్ ప్రారంభమైంది. ఆజ్ వార్త పత్రికలో బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. 1988లో దైనిక్‌జాగరణ్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించిన సింగ్, అనంత రం స్వతంత్రభారత్‌కు ఎడిటర్‌గానూ పనిచేశారు. ఆయన మృతదేహాన్ని లక్నోలోని కింగ్‌జార్జ్ మెడికల్ వర్సిటీకి అప్పగించారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ్‌నారాయణ్ దీక్షిత్, యూపీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే, బీజేపీ యూపీ ప్రధాన కార్యదర్శి సునీల్‌బన్సల్‌కూడా రాజ్‌నాథ్‌సింగ్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.