
'విచారణలో ఇది కీలక దశ.. బెయిలివ్వలేం'
న్యూఢిల్లీ: నకిలీ ఢిగ్రీ పత్రాలు కలిగి ఉన్న కేసులో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనకు ఇప్పటికే విధించిన జ్యుడిషియల్ కస్టడీని జూలై 6వరకు పెంచింది. ఆయనపై నమోదైన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, కేసు ప్రభావం రీత్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తాను సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని, అందుకే తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరుతూ తోమర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే, కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో వారి వాదనలతో కోర్టు అంగీకరించింది. తోమర్కు బెయిల్ నిరాకరించింది.