
గవర్నర్ ముందు నాలుగు దారులు
ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆశలు ఆవిరయ్యాయి. ఆమె తక్షణమే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా ఇ.పళనిస్వామిని నియమించింది. మరోవైపు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ధీమాగా ఉన్నారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్‌రావు మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఆయన ముందు నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే... –(సాక్షి నాలెడ్జ్‌సెంటర్)
1 ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ ఇద్దరు నాయకులు పోటీపడుతున్నపుడు.. వారిలో ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపిక చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అంటే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామిల్లో ఎవరో ఒకరిని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా నిర్దేశించవచ్చు.
2 రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుని, ఆ పేరును తనకు తెలియజేయాల్సిందిగా శాసన సభను గవర్నర్ కోరవచ్చు.
3 ఒకవేళ ఇరు వర్గాల వారూ.. సీఎం పదవి చేపట్టడానికి తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినట్లయితే, గవర్నర్ అందుకు సంబంధించిన నిర్ణయాన్ని శాసనసభకు వదిలిపెట్టవచ్చు.
4 మరో కీలకమైన మార్గం.. రాష్ట్ర సీఎం ఎంపిక కోసం రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం. ఏ వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందనే దానిపై గందరగోళం తలెత్తినపుడు, దానిని పరిష్కరించలేనపుడు ఈ దారిని ఎంచుకోవచ్చు. రాజ్యాంగంలోని 175 (2) అధికరణ ప్రకారం.. శాసనసభ రహస్య బ్యాలెట్ ద్వారా తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు. అదే బలపరీక్ష అవుతుంది.
1998లో ఉత్తరప్రదేశ్‌లో జగదాంబికాపాల్ ఉదంతంలో ఈ రహస్య బ్యాలెట్ పద్ధతిని చివరిసారిగా ఉపయోగించారు. జగదాంబి కాపాల్, కళ్యాణ్ సింగ్‌లలో ఒకరిని సీఎంగా ఎన్నుకోవడం కోసం శాసనసభలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అప్పుడు కళ్యాణ్ సింగ్ 29 ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీఎం పదవి చేపట్టారు.