పళనికే పట్టం
⇒ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
⇒ కోర్టు తీర్పుతో శశికళ వ్యూహాత్మక నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటుల్లో ఒకరిగా, చిన్నమ్మ శశికళకు విధేయుడిగా ఉన్న ఎడపాడి ఎమ్మెల్యే కే. పళనిస్వామికి అన్నాడీఎంకేలో పట్టం కట్టారు. శశికళకు జైలుశిక్ష తీర్పు నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అన్నాడీఎంకేలో ప్రిసీడియం చైర్మన్, శాసనసభా పక్ష నేత పదవులు గౌండర్ సామాజిక వర్గానికి దేవర్ సామాజిక వర్గానికి చెందిన శశికళ అప్పగించి ఉండడం గమనార్హం. పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో సీఎం పగ్గాలు లక్ష్యంగా చిన్నమ్మ శశికళ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
మళ్లీ జైలు కెళ్లాల్సిన పరిస్థితి రావడంతో కువత్తూరు క్యాంప్ వేదికగా శశికళ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దేవర్ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అత్యధికంగా పార్టీలో ఉన్నా, గౌండర్ సామాజిక వర్గాన్నే కాదు, ఇతర సామాజిక వర్గాల్ని ఆకర్షించే నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పటికే ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా గౌండర్ సామాజిక వర్గానికి చెందిన సెంగోట్టయన్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో శాసన సభా పక్ష నేత పదవి అదే సామాజిక వర్గానికి కట్టబెట్టడం విశేషం.
నమ్మినబంటుకే పట్టం
సేలం జిల్లా ఎడపాడి నియోజకవర్గం నెడుంగులం సమీపంలోని శిలవన్ పాళయంకు చెందిన కరుప్ప గౌండర్ తనయుడిగా రాజకీయాల్లోకి మూడు దశాబ్దాల క్రితం అడుగుపెట్టిన కే.పళనిస్వామి దివంగత సీఎం జయలలితకు నమ్మినబంటుల్లో ఒకరిగా ఉన్నారు. జయలలిత కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకుల్లో పళనిస్వామి కూడా ఒకరు. నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కడంతో ఆయన పేరు ఎడపాడి కే పళనిస్వామిగా మారింది. పన్నీర్ తదుపరి స్థానాన్ని పళనిస్వామికి అప్పగించాలన్న లక్ష్యంతో కొన్నేళ్లపాటు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే, విశ్వాసపాత్రుడు పన్నీర్‌కే అమ్మ జయలలిత అండగా నిలిచారు.
అమ్మ మరణం నేపథ్యంలో పళనిస్వామి చేతికి సీఎం పగ్గాలు అప్పగించడం లక్ష్యంగా చిన్నమ్మ వ్యూహరచన చేసినా, కేంద్రం ఒత్తిడితో పన్నీర్‌కు అప్పగించక తప్పలేదు. పన్నీర్ ధిక్కారస్వరంతో సీఎం పగ్గాలు తానే చేపట్టాలని ప్రయత్నించి చివరకు జైలుశిక్షతో వెనక్కు తగ్గారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి తన విధేయుడు పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా తెరమీదకు తెచ్చి సఫలీకృతులయ్యారు.
దేవర్‌ల అడుగులెటు?
అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేల్లో మెజారిటీ శాతం దేవర్ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. తదుపరి గౌండర్, నాడర్ ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గౌండర్ సామాజిక వర్గానికి రెండు కీలక పదవులు అప్పగించిన దృష్ట్యా, దేవర్, నాడార్ సామాజిక వర్గానికి చెందినవారు ఎలా స్పందించబోతున్నారో అన్న ప్రశ్న బయలు దేరింది. దేవర్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో 50 శాతం మేరకు ఉండడం గమనార్హం.
శాసనసభాపక్ష నేతగా...
తనకు జైలు శిక్ష పడ్డ సమాచారంతో శశికళ కాసేపు ఉద్వేగానికి లోనైనా తదుపరి అన్నాడీఎంకేను రక్షించుకోవడం, ప్రభుత్వాన్ని చేపట్టాలన్న కాంక్షతో శాసనసభాపక్ష నేత ఎంపిక మీద దృష్టి పెట్టారు. కువత్తూరులోని క్యాంప్ వేదికగా ఎమ్మెల్యేలతో చర్చించారు. ముగ్గురి పేర్లను తెర మీదకు తెచ్చినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందులో పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయన్, రహదారుల శాఖ మంత్రి కె.పళనిస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ పేర్లు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో అమ్మ జయలలిత అన్న కుమారుడు దీపక్ పేరు ప్రస్తావనకు వచ్చినా, రాజకీయ అనుభవం లేని దృష్ట్యా, సాహసం చేయకూడదన్న సూచనను పలువురు ఎమ్మెల్యేలు చేసినట్టు తెలిసింది. చివరకు శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను శశికళకే అప్పగించారు.
ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తన విధేయుడు పళనిస్వామి పేరును అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ద్వారా తెర మీదకు తెచ్చారు. క్షణాల్లో మంత్రి నిర్ణయాన్ని ప్రిసీడియం చైర్మన్ సెంగోట్టయన్ ఆమోదించారు. దీంతో అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎడపాడి కే పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తక్షణం ఫ్యాక్స్ ద్వారా ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు లేఖను పంపించారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కాసేపటికి మీడియా ముందుకు వచ్చిన పళనిస్వామి 125 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందని, తనను ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.