అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు
సెంటిమెంట్ పండిస్తున్న పన్నీర్‌సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుకు అమ్మ సెంటిమెంట్‌ను జోడించి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం. తనది అమ్మ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇది అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు అని ఆయన ప్రచారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు శశికళకు వ్యతిరేకంగా తీర్పువెలువడగానే మీడియా ముందుకు వచ్చిన పన్నీర్‌సెల్వం మరోసారి అమ్మ సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ‘అమ్మ మరణించలేదు, ఆమె ఆత్మ మనచుట్టూ తిరుగుతూనే ఉంది. ఆమె ఆశించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జయ అత్మనే ఈ తీర్పు చెప్పిందన్నారు. అమ్మ పాలన సాగేందుకు దోహదపడడం మన కర్తవ్యం, తరలిరండని శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కాగా, మంగళవారం మేట్టూ పాళయం ఎమ్మెల్యే చిన్నరాజ్, ఎమ్మెల్యే సెమ్మలైలు çపన్నీర్ శిబిరంలో చేరడంతో సెల్వంకు మద్దతిచ్చే వారి సంఖ్య పదికి చేరింది.
శశికళని తొలగించాలని ఈసీకి వినతి
పన్నీర్ మద్దతుదారులైన 12 మంది ఎంపీల లేఖ
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించాల్సిందిగా కోరుతూ పన్నీర్‌సెల్వంకు మద్దతు పలుకుతున్న 12 మంది అన్నాడీఎంకే ఎంపీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా సభ్యులుగా ఉన్నవారే ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధివిధానాల్లో ఉందని చెప్పారు. అంతేగాక నిబంధన 20 (2) ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అండమాన్–నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలని తెలిపారు.
పార్టీ చట్టంలో మార్పులు, చేర్పులు, కొత్తవాటిని రూపొందించడం అన్నాడీఎంకే సర్వసభ్యులకు మాత్రమే హక్కు ఉందని నిబంధన 43లో పేర్కొని ఉందని వారు పేర్కొన్నారు. అయితే ఇవేమీ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా శశికళ ఎన్నిక చెల్లదని వారు వాదించారు. ఈ కారణంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశారు.