కథ మారింది!
⇒ పన్నీర్ అభిమానుల ఆనందోత్సాహాలు
⇒ సుప్రీం తీర్పుతో నిస్పృహల్లో కువత్తూరు శిబిరం
⇒ తీర్పు వెలువడిన వెంటనే శశికళ కన్నీళ్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రోజుకో మలుపు తిరుగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు ఒక్క రోజులో, ఒక్క తీర్పుతో తలకిందులయ్యాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, శాసనసభాపక్ష నేత శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు అన్నాడీఎంకేలోని వైరివర్గాల పరిస్థితిని తారుమారు చేసేసింది. సోమవారం వరకు ఎంతో ధీమాతో ఉండిన శశికళ కంట కన్నీరు కారగా... ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రజాబలంతో నెట్టుకొస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంపై పన్నీటి జల్లు కురిసింది.
ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువడుతుందనే సమాచారం శశికళ, పన్నీర్‌సెల్వం మద్దతుదారుల్లో భరించలేని ఉత్కంఠను రేకెత్తించింది. పోయెస్‌గార్డెన్, అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వైపు శశికళ అనుచరగణం, చెన్నై అడయారు గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్‌సెల్వం నివాసం వైపు ఆయన మద్దతుదారులు ఉదయం తొమ్మిది గంటల నుంచే వందలాదిగా తరలిరావడం ప్రారంభించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అటు కువత్తూరులో, ఇటు పన్నీర్‌సెల్వం ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. సుప్రీం తీర్పు వెలువడగానే పన్నీర్‌సెల్వం అభిమానులు ఆనందోత్సాహాలతో కేకలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
సుప్రీంతీర్పు తమకు అనుకూలమని భావించిన పన్నీర్ ఇదే అదనుగా శశికళ మద్దతుదారు ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కువత్తూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడగలదని కొందరు అనుచరులు, అధికారులు సూచించడంతో ఆయన తన ప్రయాణాన్ని విరమించు కున్నారు. అయితే ఈ కేసులో దివంగత జయలలితనే తొలిముద్దాయి అన్న విషయాన్ని విస్మరించి పన్నీర్ వర్గం సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జయలలిత మరణించారు కాబట్టే ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లను రద్దు చేశామని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేస్తున్నారు.
దుఃఖంతో కుంగిపోయిన కువత్తూరు...
సుప్రీం తీర్పుతో శశికళ, ఆమె మద్దతుదారులు నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసిన శశికళ తీర్పు ప్రతికూలమైనా, అనుకూలమైనా తన వెంటే ఉండాలని ఎమ్మెల్యేలను కోరారు. మద్దతుదారులైన ఎమ్మెల్యేతో కలిసి టీవీ చూస్తున్న శశికళ తీర్పు వెలువడగానే నిశ్చేష్టురాలై కన్నీళ్లు పెట్టుకున్నారు. దుఃఖంతో కుంగిపోయిన శశికళను మహిళా ఎమ్మెల్యేలు ఓదార్చే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటిలో తేరుకున్న శశికళ మరలా ఎమ్మెల్యేలతో సమావేశమై, న్యాయనిపుణులతో చర్చించారు. తీర్పు శశికళకు ప్రతికూలంగా రావడంతో అదనంగా వేలాదిమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నానికి ఆమెను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బైటకు వచ్చి పోలీసులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. రిసార్టు వద్ద ప్రయివేటు బందోబస్తు విధుల్లో ఉన్నవారిని, శశికళ అనుచరులను పోలీసులు ఐదు ప్రభుత్వ బస్సుల్లో ఎక్కించి చెన్నైకి పంపివేశారు. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఢిల్లీలో ఉన్న లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై ప్రకటించారు. నిత్యం రద్దీగా ఉండే పోయెస్‌గార్డెన్‌లో జనం పలుచబడగా, ఉన్న కొద్దిపాటి అనుచరులు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే నిష్క్రమించడంతో వెలవెలపోయింది. అలాగే అన్నాడీఎంకే కార్యాలయం ప్రధాన ద్వారాన్ని పాక్షికంగా మూసివేసి పార్టీ శ్రేణులంతా లోపలే దిగాలుగా ఉండిపోయారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటి వద్ద కూడా అదనంగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా 1,100 మందిని అరెస్ట్ చేశారు.