
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రో రైళ్లు, డీటీసీ, క్లస్టర్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పించే ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 1,000 జనసభలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పార్టీ మహిళా విభాగం కార్యవర్గసభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశాల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, పార్టీ నిర్వహించే సర్వేల ఆధారంగా వారం ఆఖరున సమగ్ర ఫీడ్‌బ్యాక్ నివేదిక రూపొందిస్తారు.
చదవండి: ఢిల్లీ మహిళలకు శుభవార్త
ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మహిళా విబాగం సభ్యులు తమ తమ ప్రాంతాలలో జనసభలు జరిపి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తారు. ఈ వారం రోజులలో 1,000 జనసభలు జరుపుతారు. ప్రతి ఎమ్మెల్యే, కౌన్సిలర్, మహిళా విభాగం సభ్యులకు పదేసి జనసభలు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాలలో నివసించేవారితో మాట్లాడి నోట్స్ రూపొందిస్తారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సమర్థిస్తున్నారా, సమర్థిస్తున్నట్లయితే ఎందుకు అని పార్టీ కార్యకర్తలు ప్రజలను ప్రశ్నిస్తారు. ఈ పథకంపై బీజేపీ వ్యతిరేకతను అంగీకరిస్తారా అని కూడా ప్రశ్నిస్తారు. అంగీకరిస్తామని సమాధానమిచ్చేవారిని ఎందుకు అంగీకరిస్తున్నారని కూడా ప్రశ్నిస్తారు.