జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది.
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. అధికారంలోకి వస్తే.. ఆదాయపన్ను(ఐటీ) పరిధిలోకిరాని ప్రజలకు ప్రతి నెలా 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని, బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా టీవీసెట్లు ఇస్తామని వాగ్దానం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ విడుదల చేశారు.
రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతను తీసుకురావడం లక్ష్యంగా.. జార్ఖండ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 81 నుంచి 140 సీట్లకు పెంచేందుకు చర్యలు చేపడతామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీఇచ్చింది. మేధావులకు స్థానం కల్పించడానికి వీలుగా శాసన మండలిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.