
ముంబై మురికివాడలో కరోనా కలకలం
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన నగరంలోని ధారవిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ధారవిలో శుక్రవారం 25 తాజా కేసులు వెలుగుచూడటంతో ఈ ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 808కి ఎగబాకింది. కాగా, ముంబైలో కరోనా కేసుల కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర బృందం సూచించింది. ఇక ముంబై కరోనా మహమ్మారి కేంద్రంగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిపై వేటు వేసింది. ప్రవీణ్ స్ధానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఎస్ చహల్‌కు ప్రతిష్టాత్మక బీఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ముంబై నగరంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అదుపులోకి తేవడంలో ప్రవీణ్ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది