
కర్ణాటక, మైసూరు : బాలిక సమయస్ఫూరితో బాల్య వివాహం నుంచి బయటపడిన ఘటన మైసూరు తాలూకా జయపుర హోబళిలో వెలుగు చూసింది. హోబళిలోని మార్బళ్లిహుండి గ్రామానికి చెందిన ఓ బాలిక (15)కు తల్లితండ్రులు బంధువైన యువకుడితో ఈనెల 30న వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బాలిక తల్లితండ్రులకు ఎంతచెప్పినా వినకపోవడంతో ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని భావించిన బాలిక అందుకు ఫేస్‌బుక్‌ను మార్గంగా ఎంచుకుంది.
మొత్తం విషయాన్ని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా బెంగళూరు నగర పోలీసులకు విషయాన్ని వివరిస్తూ పోస్ట్ పెట్టింది. ఇది గమనించిన బెంగళూరు పోలీసులు వెంటనే మైసూరు పోలీసులకు విషయాన్ని చేరవేయడంతో అప్రమత్తమైన మైసూరు పోలీసులు వెంటనే మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులతో కలసి గ్రామానికి చేరుకున్నారు. మైనర్ వివాహం చట్టరీత్యా నేరమని మరోసారి బాలికకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లితండ్రులు, బంధువులను హెచ్చరించారు. ఒకవేళ అదే యువకుడిని వివాహం చేసుకోవడానికి బాలిక అంగీకరిస్తే బాలికకు మైనారిటీ తీరాక వివాహం జరిపించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment