
పుణేలో మహాగణపతులకు పూజలు
గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పుణే గణపతులకు ప్రత్యేక ఉంది. ఇక్కడ స్థాపించిన ఐదు పురాతన మహా గణపతులకు ఒక్కో గణపతికీ ఒక్కో ప్రత్యేకత ఉంది.
మొదట నిమజ్జనం చేసేది ఈ గణనాథులనే
పుణే సిటీ, న్యూస్‌లైన్: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పుణే గణపతులకు ప్రత్యేక ఉంది. ఇక్కడ స్థాపించిన ఐదు పురాతన మహా గణపతులకు ఒక్కో గణపతికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ గణపతులనే మొదట నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాతనే నగరంలో మిగతా గణనాథులను నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ గణనాథులను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నగరం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పుణేలోని మహా గణనాథులను దర్శించుకుకుని మొక్కులు తీర్చుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు.
మొదటి గణపతి ‘కస్బా’ గణపతి
నగరంలో కస్బా గణపతి మొదటి గణపతి. కస్బాపేట్‌లో 1893లో ఆలయం నిర్మించారు. 1894 నుంచి నిమజ్జన ఉరేగింపులో మొదట ఈ వినాయకుడే ఊరేగుతాడు. వినాయక్ ఠాకూర్ తన ఇంటి సమీపంలోనే ఈ గణనాథునికి అందమైన మందిరాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ విఘ్నేశ్వరుడు పుణే వాసుల గ్రామ దైవంగా విరాజిల్లుతున్నాడు. కస్భా గణపతి మండల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి వేడుకలను జరుపుకుంటున్నారు. 1925 వరకు కస్బా గణపతి ఆలయం లోపల వేడుకలు జరిగేవి. 1926 నుంచి గణపతి ఉత్సవాలను ప్రత్యేక మండపంలో జరుపుతున్నారు. కళాకారులు తమ కళలు ప్రదర్శించేందుకు దీనికి ఒక వేదికలాగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రదర్శనలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి గణేష్ భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది పుణే మేయర్ చంచల కోద్రే గననాథుడికి హారతి నిచ్చి ప్రతిష్ఠించారు.
రెండో గణపతి.. తాంబడి జోఘేశ్వరి గణపతి
తాంబడి జోగేశ్వరి ఆలయం నగరంలో పురాతన ఆలయాలలో ఒకటి. 1636లో చత్రపతి శివాజీ మహారాజ్ తన తల్లి జిజాబాయ్‌తో పుణే వచ్చి దేవత దీవెనలు తీసుకున్నట్లు ఇక్కడేనని చరిత్ర చెబుతోంది. పీష్వాల కాలంలో ఆలయానికి కేటాయించిన భూమిలో 1705లో పెద్ద మందిరాన్ని నిర్మించారు. 1893లో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ సార్వజనీక వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడే ప్రారంభించారు. గణేష్ ఉత్సవం వేడుకలు 1893లో ప్రారంభం కాగా, ఇప్పటికీ ప్రతీఏటా కొనసాగిస్తున్నామని తాంబడి జోగేశ్వరి గణేష్ మండల్ కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. 2000 వరకు గణేష్ వేడుకలు ఆలయంలోనే జరుపుకునే వారు. ప్రతి ఏటా భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్తున్నారు. వివేక్ గోలే చేతుల మీదుగా విగ్ర ప్రతిష్ఠాపన చేశారు.
మూడో గణపతి గురుజీ తాలీం...
పుణేలోని లక్ష్మి రోడ్ సమీనంలోని గణపతి చౌక్ వద్ద 1887లో దీనిని స్థాపించారు. ఇది హిందూ, ముస్లింల ఐకమత్యానికి చిహ్నంగా నిలిస్తోంది. గురూజీ తాలీం గణపతి మండల్ నగరంలో అత్యంత గౌరవించే గణపతి. భికు పాండురంగ్ షిండే, వస్తాద్ నలబంద్ కుటుంబాలు మండల్ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించాయి. 1987లో శత జయంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మనోజ్ చాజెడ్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
నాలుగవ గణపతి తులసి బాగ్ గణపతి...
తులసి బాగ్ రామ్ మందిరంలో 1901లో దీనిని స్థాపించారు. పుణేలో పురాతన ప్రసిద్ధ గణేష్ మండల్‌లలో ఇదొకటి. ఈ ఆలయం ప్రముఖ తులసి బాగ్ మార్కెట్ మధ్యలో ఉంది. 10-15 అడుగుల గణేష్ విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. లార్డ్ గణేష్ ధరించే బంగారు, వెండి ఆభరణాలు భక్తులకు ఇట్టే ఆకట్టుకుంటాయి. వినాయకుడు అతని రెండు చేతులలో పాషా, అంకుశ్ లాంటి ఆయుధాలు కలిగి ఉన్నాడు. గనేష్ విగ్రహం పక్కన ఆయన వాహనమైన మూషికం అందంగా కనిపిస్తోంది. అయితే వెండితో ఈ మూషికాన్ని తయారు చేశారు. వినాయకుని రెండు వైపులా అందమైన ఏనుగు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. దీనిని కల్నల్ సంభాజీ పాటిల్ ప్రతిష్టాపన చేశారు.
ఐదవ గణపతి కేసరివాడ గణపతి
నారాయణ పేట్‌లో తిలక్ వాడలో 1893లో ఈ వినాయక మందిరాన్ని స్థాపించారు. తిలక్ కుటుంబం వారసులు ఈ ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్న తర్వాత కేసరి వాడా వేడకలు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది రోహిత తిలక్ ఈ వేడకల్లో పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ 1893లో విగ్రహం ఏర్పాటు చేశారు. గొప్ప గొప్ప వ్యక్తుల ప్రసంగాలు ఇక్కడ చూడవచ్చు. పండుగ సమయంలో ప్రఖ్యాత కళాకారులు అనేక ప్రదర్శనలు నిర్వహిస్తారు.