
సంచలనం సృష్టిస్తున్న వీడియో
పుణె: వినాయక నిమజ్జన ఉత్సవం ఇటీవలనే ముగిసిపోయినప్పటికీ అది చాటి చెప్పిన ఓ మానవీయ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా చక్కెర్లు కొడుతోంది. కాషాల జెండాలు, వస్త్రాలు ధరించిన భక్తులు, భజనపరులు డప్పుల దరువులకు గంతులేస్తుండగా, వారి చుట్టూ వేలాది మంది ప్రజలు ఇసుకకూడా రాలనంతగా కిక్కిర్సిపోయి ఉన్నప్పుడు అటుగుండా ఓ అంబులెన్స్ వచ్చింది.
దానికి జన సముద్రం రెండుగా చీలిపోయి దారిచ్చింది. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌చేయగా, దీన్ని ఇప్పటికే పది లక్షల మందికిపైగా చూశారు. రెండు రోజుల్లో 40 వేల మందికిపైగా షేర్ చేసుకున్నారు.
పుణెలో వినాయక నిమజ్జనం రోజున తీసిన ఈ రెండు నిమిషాల నిడివిగల వీడియో విదేశాల్లో వింతకాకపోవచ్చు. భారత్‌లాంటి దేశంలో, అందులోనూ వినాయక నిమజ్జనం రోజున ఇలాంటి మానవత్వాన్ని చాటిచెప్పే సంఘటనలు చాలా చాలా అరదు. ఆరోజున ట్రాఫిక్ ఎంతగా స్తంభించిపోతుందో, పొరపాటున అత్యవసరమై వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వారి అవస్థలు మనకు అనుభవపూర్వకమే. వీఐపీలకు కూడా ఆరోజు దారిచ్చే దారులుండవు.