ఎంత తెలివిగా మోసం చేస్తున్నారు!
ముంబై: కేటుగాళ్లు తెలివి మీరిపోతున్నారు. రైళ్లల్లో, విమానాల్లో, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తూ డ్రగ్స్, బంగారం లాంటివి పోలీసులు, నిఘా అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తుంటారు. తాజాగా ఓ గ్యాంగ్ ఇలాంటి ప్రయత్నం చేయగా సిబ్బంది మాత్రం చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి గుట్టు రట్టు చేసింది. బ్యాగులు, షూలు, బాడీలో దాస్తూ తరచుగా విమానాలలో అక్రమంగా తరలించి చివరగా ఎయిర్ పోర్టు అధికారులకు దొరికిపోతుండటం చూస్తూంటాం.
ముంబైలో 1048 గ్రాముల బంగారాన్ని కరిగించి ఎలక్ట్రికల్ జ్యూస్ మిక్సర్ లో పాత్రగా చేసి తీసుకెళ్తుంటే గుర్తించారు. ఓ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో నిఘా అధికారులు అతడిని తనిఖీ చేయగా బ్యాగులో మిక్సర్ ఉన్నట్లు చూసి, పరిశీలించగా అందులో బంగారంతో ఉన్న పాత్రను గుర్తించారు. బంగారం ఇలా కూడా అక్రమరవాణా చేస్తారా అని వాళ్లు ఆశ్చర్యపోయారు. దీని బరువు కేజీ పైగా ఉందని, ఈ బంగారం విలువ దాదాపు రూ.28 లక్షల రూపాయలు ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.