న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాల్లో సవరణలను సూచించేందుకు ఏర్పాటైన మంత్రివర్గం సంఘం పలు సూచనలు చేసింది. ఏసీ, నాన్–ఏసీ రెస్టారెంట్లు అనే తేడా లేకుండా అన్ని రెస్టారెంట్లలోనూ (కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకోనివి) 12 శాతం పన్నునే వసూలు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం కాంపోజిషన్ పథకంలో ఉన్న రెస్టారెంట్లకు 5 శాతం, తయారీదారులకు 2 శాతం పన్ను వర్తిస్తుండగా ఈ రేటును 1 శాతానికి తగ్గించాలని సూచించింది.
అలాగే గది అద్దె రూ.7,500కు మించి ఉన్న హోటళ్ల రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న 18 శాతం పన్నునే ఫైవ్–స్టార్ హోటళ్లలోని రెస్టారెంట్లలోనూ విధించాలంది. కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్న ఒక వ్యాపారి పన్ను వర్తించని, వర్తించే...రెండు రకాల వస్తువులను అమ్ముతున్నప్పుడు అతను మొత్తం టర్నోవర్‌పై పన్ను కట్టాలంటే 0.5 శాతం, పన్ను వర్తించే వస్తువల టర్నోవర్‌కు మాత్రమే పన్ను కట్టాలంటే 1 శాతం పన్ను ఉండేలా చూడాలని మంత్రివర్గం సలహా ఇచ్చింది. దేశంలో ఇప్పటివరకు కోటికి పైగా వ్యాపారులు జీఎస్టీ కింద నమోదు చేసుకోగా, 15 లక్షల మంది కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment