తెలంగాణపై సమావేశమైన మంత్రుల బృందం
ఆంటోనీ, చిదంబరం మినహా ఐదుగురు మంత్రుల హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో పునర్వ్యవస్థీకరించిన కేంద్ర మంత్రుల బృందం శుక్రవారంనాడిక్కడ తొలిసారిగా సమావేశమైంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో నిష్పాక్షికంగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తామని ప్రకటించింది. నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో దాదాపు 45 నిమిషాలసేపు జరిగిన ఈ సమావేశానికి విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా మిగిలిన అయిదుగురు మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, వి.నారాయణసామి హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేయడంలో జీవోఎంకు కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన 11 పరిశీలనాంశాలకు సంబంధించిన వివరాలతో సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖల నుండి నివేదికలను కోరాలని, రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సమాచారాన్ని కోరాలని నిర్ణయించింది.
ప్రాథమిక చర్చ మాత్రమే జరిగింది: షిండే
జీవోఎంకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులపైనే తొలి సమావేశంలో ప్రాథమికంగా చర్చ జరిగిందని కేంద్ర హోం మంత్రి షిండే, ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌లు వెల్లడించారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో అనుసరించాల్సిన మౌలిక విధివిధానాలను పరిశీలన మినహా ప్రధాన నిర్ణయాలేమీ తీసుకోలేదని తెలిపారు. జీవోఎం పరిశీలనాంశాల్లో పొందుపరిచిన అంశాలపై కేంద్రంలోని జలవనరుల మంత్రిత్వశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి, రవాణా వంటి సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటి నుండి నివేదికలను కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు షిండే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అవసరమైన సమాచారాన్ని కోరాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించడంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. అయితే సీమాంధ్ర ప్రజల భయాందోళనలు, సమస్యలను పరిష్కరించడంలో జీవోఎం నిష్పక్షపాతంగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆ తర్వాత విడుదలైన అధికార ప్రకటన హామీ ఇచ్చింది.
పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా వ్యవహరించాల్సిన హైదరాబాద్ నగర ప్రతిపత్తి, రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల నిర్ణయం, నదీజలాలు, విద్యుచ్ఛక్తి, ఆదాయ వనరుల పంపిణీ, సహజ వనరులు, సిబ్బంది పంపిణీ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పరిష్కరించాల్సిన 11 అంశాలతో జీవోఎం పరిశీలనాంశాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై సమర్పించే స్టేటస్ రిపోర్టులను అధ్యయనం చేసి కేంద్ర మంత్రివర్గానికి సమర్పించే నివేదికలో పొందుపరిచే సిఫార్సులను పర్యవేక్షించేందుకు జీవోఎం సభ్యుల మధ్య పని విభజన కూడా జరిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆరు వారాల్లో జీవోఎం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం మొదట నిర్దేశించినా ఆ తర్వాత గడువును తొలగించడం తెలిసిందే. జీవోఎం నివేదిక సమర్పణకు ఎలాంటి గడువు లేదని ఆజాద్ స్పష్టంగా చెప్పడం గమనార్హం. అలాగే కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం లేదని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి.
సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ?
ఎన్ని అవరోధాలు ఎదురైనా రాష్ట్ర విభజన నిర్ణయంతోనే ముందుకు సాగాలని కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలను బుజ్జగించేందుకు భారీగా ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విభజనానంతరం రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల సత్వరాభివృద్ధికి అవసరమైన సిఫార్సులు చేయాలన్న అంశాన్ని మంత్రుల బృందం పరిశీలనాంశాల్లో చేర్చింది. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం కోసం భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రమంత్రుల బృందం సిఫార్సు చేయవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీమాంధ్రకు రాజధానిని ఆ ప్రాంత నేతలతో సంప్రదించిన తర్వాతే కేంద్రం ఎంపిక చేస్తుందని, కొత్త రాజధానిని అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేసుకొనేందుకు భారీగా నిధులు సమకూర్చే అవకాశం లేకపోలేదని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.