షిండే వచ్చేదాకా సాగదీత..! | Home ministry to prepare draft on telangana, after sushil kumar shinde return from hospital | Sakshi
Sakshi News home page

షిండే వచ్చేదాకా సాగదీత..!

Published Sat, Aug 17 2013 2:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Home ministry to prepare draft on telangana, after sushil kumar shinde return from hospital

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: ఓవైపు రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో మిన్నంటుతున్న నిరసనలు.. మరోవైపు హోంమంత్రి షిండే ఆసుపత్రిలో ఉండడంతో తెలంగాణపై ముందుకు వెళ్లలేని పరిస్థితి..! ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతలతో చర్చలు, సంప్రదింపుల పేరుతో వీలైనంత మేర కాలాన్ని సాగదీసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. అంతేగానీ సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలకు సమాధానం చెప్పడానికిగానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల డిమాండ్లను ఆలకించడానికి కాదని తెలుస్తోంది. పార్టీలోని అత్యున్నతస్థాయి వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
 
  షిండే ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల చివరకు కూడా ఆయన ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదు. అప్పటిదాకా చర్చలు, సంప్రదింపుల పేరుతో సాగదీతను కొనసాగించాలని ఆంటోనీ కమిటీకి అధిష్టానం పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధ్యయనం పూర్తయింది. షిండే రాగానే తెలంగాణపై ముసాయిదా రూపొందిస్తాం. ఇందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. తెలంగాణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముసాయిదా తయారయ్యే వరకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామన్న భావన కల్పించేందుకు ఆంటోనీ కమిటీ దోహదపడుతుంది’’ అని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement