సీమాంధ్రుల మనోభావాలను గౌరవిస్తాం : సుశీల్ కుమార్ షిండే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న ప్రజాందోళన కేంద్రాన్ని తీవ్రంగా కలవరపరుస్తోం ది. సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ తీవ్రతరమౌతుండడం, విద్యుత్ సమ్మెతో దక్షిణాది గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉండడంతో సీమాం ధ్రుల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని, విభజనానంతరం ఎదురయ్యే వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణపై మంత్రుల బృందం (జీఓఎం) ప్రాథమిక చర్చల అనంతరం ఆర్థిక మంత్రి చిదంబరం, సిబ్బంది శాఖ మంత్రి నారాయణ స్వామితో కలిసి ప్రధానితో సమావేశమైన అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన అంశం అత్యంత సున్నితమైనదని అంగీకరించిన ఆయన సీమాంధ్ర ప్రజల భయాందోళనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొంటుందని హామీ ఇచ్చారు. విభజన కారణంగా సీమాంధ్రుల ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ, ప్రభుత్వోద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, సీమాంధ్ర విద్యార్థు లు, యువతకు హైద్రాబాద్‌లో విద్య, ఉద్యోగ అవకాశాలు, మరీముఖ్యంగా హైద్రాబాద్‌లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకొన్న సీమాంధ్రులకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగిన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని షిండే వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన స్టేక్‌హోల్డర్లతో అన్ని అంశాలపై మంత్రుల బృందం సంప్రదింపులు జరిపి అత్యుత్తమ పరిష్కారమార్గాలను కనుగొనేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వోద్యోగులు సమ్మె విరమించి ప్రభుత్వంతో సహకరించాలని షిండే విజ్ఞప్తి చేశారు.