ఇంటర్నెట్‌ను గూగుల్ కలుషితం చేస్తోంది
సర్వేయర్ జనరల్ స్వర్ణ సుబ్బారావు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా అధికారిక రహస్య సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులోకి తెస్తూ గూగుల్ కంపెనీ ఇంటర్నెట్‌ను కలుషితం చేస్తోందని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు ఆరోపించారు. మ్యాపథాన్-2013 కార్యక్రమం ద్వారా సైన్యం, ప్రభుత్వానికి చెందిన రహస్య స్థావరాలను గూగుల్ బహిరంగ మ్యాపులలో చేర్చిందని, దీనిపై వివరణ కోరామని ‘పీటీఐ’కి తెలిపారు.
వివరణనిచ్చేందుకు కంపెనీ ప్రతినిధులు తనను ఓ హోటల్‌లో కలుస్తామన్నారని, కానీ తనను ఆఫీసులోనే కలవాలని చెప్పానన్నారు. దేశ మ్యాపులు రూపొందించేందుకు సర్వే ఆఫ్ ఇండియా(ఎస్‌ఓఐ)కి మాత్రమే అధికారం ఉంది. అయితే నెటిజన్ల నుంచి సమీప ప్రాంతాల సమాచారాన్ని కోరిన గూగుల్.. వారి సమాచారం ఆధారంగా రక్షణశాఖకు చెందిన రహస్య స్థావరాలను సైతం మ్యాపులలో చేర్చింది.