మరో పెద్ద మార్పు చేయనున్న కేంద్రం!
న్యూఢిల్లీ: పాత పద్ధతులు, పాత వ్యవస్థలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పాత సంప్రదాయానికి కూడా స్వస్థి పలికే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో మార్పులు చేయాలని భావిస్తోంది. ఇక నుంచి గతంలో మాదిరిగా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి కాకుండా జనవరి నుంచి డిసెంబర్‌కు లెక్కగట్టాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని శుక్రవారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు లోక్‌సభలో ప్రకటించారు. 'ఆర్థిక సంవత్సరం మార్పు అంశం ప్రస్తుతం పరిగణనలో ఉంది' అని ఆయన తెలిపారు.
ఒక వేళ ఆర్థిక సంవత్సర షెడ్యూల్ మారిస్తే 2018 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరిలో కాకుండా డిసెంబర్‌లో ప్రవేశ పెడతారా, నవంబర్‌లో ప్రవేశపెడతారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండగా ఆ విధానానికి స్వస్థి పలికి అంతా ఒకే బడ్జెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. అలాగే, గతంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. ఈ విధంగానే మరోసారి ఆర్థిక సంవత్సరం కూడా మార్పు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది.