
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా న్యాయవాది న్యాయవాది హత్య కలకలం రేపింది. నూతన్ యాదవ్(35) అనే ప్రభుత్వ మహిళా న్యాయవాది హత్యకు గురయ్యారు. ఎటా జిల్లాలో పోలీస్ లైన్స్ ఎదురుగా ఉన్న క్వార్టర్‌లో ఆమె నివాసంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమెను కాల్చి చంపారు.
ఎటా పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం ఆగ్రా నివాసి అయిన నూతన్ అవివాహితురాలు, ఒంటరిగా నివసిస్తోంది. అయితే కుటుంబానికి అత్యంత సన్నిహతులైన వారే ఈ హత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. ఆమె గ్రామానికి చెందిన కొంతమంది ఆమెను తరచూ సందర్శించేవారనీ, ఆమె నివాసంలో ఉండేవారని తెలుస్తోంది. వీరే ఈ దురాగతానికి పాల్పడి వుంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారని ఎస్‌పీ తెలిపారు.
కాగా రెండు నెలల క్రితం( జూన్,12) యూపీ బార్ కౌన్సిల్ మొదటి మహిళా అధ్యక్షురాలు దర్వేష్ యాదవ్(38)ను తోటి న్యాయవాది ఆగ్రా కోర్టు ప్రాంగణంలో కాల్చి చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా న్యాయవాదులపై ఘోరమైన దాడులకు సంబంధించిన మరో సంఘటనలో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కుల్‌జీత్ కౌర్ (60) జూలై 4న నోయిడా సెక్టార్ 31 లోని ఆమె బంగ్లాలో శవమై తేలిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment