సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా పెరుగుతున్నా తాజా కేసుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1543 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 6868 మంది వైరస్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రికవరీ రేటు 23.3 శాతానికి చేరడం, కేసులు రెట్టింపయ్యే డబ్లింగ్ రేటు 10.2 రోజులకు పెరగడం ఊరట కలిగించే పరిణామమని అన్నారు.
ఇక దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 934కు పెరిగిందని చెప్పారు. 17 జిల్లాల్లో 28 రోజులుగా ఎలాంటి కేసులూ వెలుగుచూడలేదని అన్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న గుజరాత్‌కు రెండు కేంద్ర బృందాలు చేరుకున్నాయని తెలిపారు. కాగా ప్లాస్మా థెరఫీని ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌కు చికిత్సగా ప్లాస్మా థెరఫీని వాడవచ్చనేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. ప్లాస్మా థెరఫీని జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment