పన్నీర్‌సెల్వంపై స్వామి సంచలన కామెంట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యంస్వామి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పారు. ఈ విషయంపై తాను ఇప్పుడే రాష్ట్రపతిని కలిశానని, తమిళనాడు రాజకీయ పరిణామాలు వివరించానని, రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు కూడా రాష్ట్రపతితో చర్చించానని తెలిపారు.
‘తమిళనాడులో ఇలాంటి రాజకీయ సంక్షోభ పరిస్థితులు పెట్టుకొని గవర్నర్ మహారాష్ట్రలో కూర్చోవడం తగదు. ఆయన వచ్చి బాధ్యతల ప్రకారం ప్రమాణం చేయించాలి. ఒక వేళ పూర్తి స్థాయి మద్దతు లేకుండా ఉంటే మాత్రం రాజకీయ అనిశ్చితి ఎలాగో తప్పదు’ అంటూ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నాకు జయలలిత చాలా సంవత్సరాలుగా శత్రువుగా, మిత్రురాలిగా తెలుసు. ఆమె కచ్చితంగా పన్నీర్ సెల్వాన్ని ఒక రబ్బర్ స్టాంపుగానే భావించి ఉంటుంది’ అంటూ సంచలన వ్యాఖ్య చేశారు.
‘రాజీనామా చేసిన తర్వాతే శశికళపై ఎందుకు కామెంట్ చేస్తున్నారు? రాజీనామా చేయకముందే తనను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని చెప్పి, ఈ విషయాలన్నీ చెబితే గొప్ప నాయకుడు అయ్యేవారు. శశికళను ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నవారిలో సెల్వం లేరా. ఇప్పుడంతా చేయి జారాక ఆయన మాట్లాడటం సరికాదు’ అని స్వామి అన్నారు.