
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా రాజ్యసభకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది రైతులకు ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశామని, మిగతా 7 కోట్ల మందికి కూడా వీటిని అందజేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. రైతులందరికీ సంస్థాగత రుణ సదుపాయం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ముఖ్యమైందిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతు సమస్యలపై ప్రవేశపెట్టిన ఓప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. చిన్న కమతాల పెరుగుదల, దిగుబడులు తగ్గడంపై ఆయన మాట్లాడుతూ.. దీనికి విరుగుడుగా ఉమ్మడి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు.
జన్యు పంటలు ప్రమాదకరమనేందుకు ఆధారాల్లేవు: కేంద్రం
జన్యు పంటలు ప్రమాదకరమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లోక్‌సభకు తెలిపారు. మనుషులకు ప్రమాదకరంగా పరిణమించే జన్యు పంటలను చట్ట విరుద్ధంగా పండించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలలకు సూచించామన్నారు.
ఆగస్టు 2 వరకు పార్లమెంట్!
పార్లమెంట్ సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీతో సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం అన్ని బిల్లులను ప్రవేశపెట్టేందుకు వీలుగా సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేనప్పటికీ అధికార పక్షం నిర్ణయమే అంతిమం కానుంది. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ట్రిపుల్ తలాక్ సహా మరో 13 బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. జూన్ 17వ తేదీ నుంచి కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు గత 20 ఏళ్లలోనే అత్యంత ఫలప్రదంగా సాగాయని పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది.