త్వరలో జాతీయ సెక్స్ నేరగాళ్ల జాబితా!
న్యూఢిల్లీ: జాతీయ లైంగిక నేరగాళ్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహిళలపై వివిధ రకాల లైంగిక నేరాలకు పాల్పడి చార్జ్ షీట్ ఎదుర్కొంటున్న నిందితుల వివరాలు బయటపెడతామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టుకు నివేదించింది. ' క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్)లో భాగంగా లైంగిక నేరగాళ్ల రిజిస్ట్రీ ప్రతిపాదించనున్నాం. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు ఉదాహరణకు సెక్షన్ 375 (అత్యాచారం), 376ఏ (విడిపోయిన తర్వాత భార్యతో భర్త లైంగిక చర్యకు పాల్పడటం), 376 బీ (ఉన్నతస్థాయి అధికారి దిగువ స్థాయి ఉద్యోగినిపై లైంగిక చర్యలకు పాల్పడటం) వంటి కేసుల్లో చార్జ్ షీట్ ఎదుర్కొంటున్న నేరగాళ్ల వివరాలు ఇందులో పొందుపరుస్తాం' అని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది.
ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి ఘటనకు సంబంధించిన ఎమ్మెమ్మెస్ ఆన్ లైన్ లో తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. మహిళలపై సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సవివరంగా తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల అదుపునకు తీసుకున్న చర్యలు వివరిస్తూ కేంద్ర హోంశాఖ ఈ అఫిడవిట్ ను దాఖలు చేసింది.