ఛూ మంతర్‌.. కాలుష్యం ఖాళీ! | Graviky Labs: Converting air pollution to ink | Sakshi
Sakshi News home page

ఛూ మంతర్‌.. కాలుష్యం ఖాళీ!

Published Thu, Dec 7 2017 4:39 AM | Last Updated on Thu, Dec 7 2017 5:18 AM

Graviky Labs: Converting air pollution to ink - Sakshi

కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాల పొగ గొట్టానికి బిగించే కాల్‌ ఇంక్‌ యంత్రం

బైకు వేసుకుని అలా ఒక్క రౌండ్‌ బయటికెళ్లండి..
తిరిగి వచ్చేసరికి తెల్లషర్టు కొద్దో గొప్పో మసిబారిపోతుంది.
వాహనాల పొగతో వస్తున్న కాలుష్యం అంతుంది మరి! నిజమేగానీ.. ఏం చేస్తాం.
సర్దుకుపోక తప్పదు కదా అనుకుంటున్నారా?
అవసరం లేదంటోంది గ్రావికీ ల్యాబ్స్‌.

వాహనాల కాలుష్యం తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెరుగైన ఇంజన్లు తయారు చేస్తున్నారు. హైబ్రిడ్‌ కార్లు ప్రవేశపెడుతున్నారు. అయినాసరే.. కాలుష్యం మాత్రం తగ్గట్లేదు. దీంతో ఈ సమస్యను గ్రావికీ ల్యాబ్స్‌కు చెందిన అనిరుద్ధ్‌ శర్మ పూర్తిగా కొత్త కోణంలో చూశాడు. ఈ ముంబై కుర్రాడు నాలుగేళ్లుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓ వినూత్న యంత్రాన్ని తయారు చేసే పనిలో పడ్డాడు. ఇటీవలే విజయవంతంగా పరీక్షించాడు. ఈ యంత్రం ఏం చేస్తుందో తెలుసా.. వాహనాల పొగలో ఉండే కాలుష్యాన్ని పీల్చేస్తుంది.          

కాల్‌ ఇంక్‌ నుంచి ఎయిర్‌ ఇంక్‌ వరకు..
ఈ యంత్రం పేరు కాల్‌ ఇంక్‌! చిన్నసైజు గొట్టంలా ఉండే ఈ పరికరాన్ని వాహనాలు పొగ గొట్టాలకు బిగించుకుంటే చాలు. దాంట్లోంచి వచ్చే పొగ మొత్తం దాదాపు ఫిల్టర్‌ అయిపోతుంది. మసిలాంటి పదార్థం కాల్‌ ఇంక్‌లో మిగులుతుంది. స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ సాయంతో ఇది పనిచేస్తుంది. మరి దీన్నేం చేస్తారంటే.. ముందు కొన్ని రసాయనాలతో శుద్ధి చేసి కేన్సర్‌ కారక పదార్థాలను తొలగిస్తారు. ఆ తర్వాత మిగిలేది నల్లటి కార్బన్‌ ఇంకు మాత్రమే. దీన్ని పెన్నుల్లో, ప్రింటర్లలో ఇంకుగా వాడుకోవచ్చని అనిరుద్ధ్‌ చెబుతున్నాడు. దీనికి ఎయిర్‌ ఇంక్‌ అని పేరు పెట్టారు. ఇటీవల హాంకాంగ్‌కు చెందిన ఓ సంస్థతో కలసి ఎయిర్‌ ఇంక్‌ను పరీక్షించారు. మొత్తం 2,500 గంటల పాటు గాలిని శుభ్రం చేసి సేకరించిన మసితో 150 లీటర్ల ఇంకును తయారు చేశారు. ఒక్కో కాల్‌ ఇంక్‌ మసితో నిండేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత గ్రావికీ ల్యాబ్స్‌ వాటిని ఎయిర్‌ ఇంక్‌గా మారుస్తారు. ప్రస్తుతానికి ఈ కాల్‌ ఇంక్‌ పరికరాలను డీజిల్‌ జనరేటర్లతో పాటు లారీలు, కార్లకు బిగించుకునే అవకాశముంది. మోటార్‌ బైక్‌ల కోసం కూడా ఈ యంత్రాలు సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

కళాకారులతో నిధుల సేకరణ..
కాలుష్యాన్ని ఇంకుగా మార్చాలని అనిరుద్ధ్‌ నాలుగేళ్ల కిందే భావించాడు. తన ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన మీడియా ల్యాబ్‌లో పనిచేశాడు. వేర్వేరు రంగాల నిపుణుల సహకారంతో కాల్‌ ఇంక్‌ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం వాణిజ్య స్థాయి ఉత్పత్తికి కిక్‌స్టార్టర్‌ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. నిధులు అందించే వారికి ఎయిర్‌ ఇంకుతో దేశ విదేశాల్లోని కళాకారులు తయారు చేసిన కళాకృతులను బహుమతిగా ఇస్తున్నారు. ఇప్పటికే 41 వేలకుపైగా డాలర్లు వచ్చిపడ్డాయి. వేర్వేరు పద్ధతుల్లో దాదాపు 1.6 లక్షల కోట్ల లీటర్ల గాలిని శుద్ధి చేసి 1,600 కోట్ల మైక్రో గ్రాముల కాలుష్యాన్ని ఇంకుగా మార్చినట్లు గ్రావికీ వెబ్‌సైట్‌ చెబుతోంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘చక్ర్‌’అనే మరో సంస్థ కూడా కాలుష్యాన్ని ఇంకుగా మార్చేందుకు ఓ యంత్రాన్ని రూపొందించింది. కాల్‌ ఇంక్‌తో పోలిస్తే దీని సైజు చాలా ఎక్కువ!                                                          
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

కాల్‌ ఇంక్‌ యంత్రాన్ని తయారుచేసిన అనిరుద్ధ్‌ శర్మ బృందం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement