ఏసీ హోటళ్లకు ఉపశమనం
లాటరీ శ్లాబులనూ నిర్ణయించిన జీఎస్టీ మండలి
► ఆరు నూరైనా జూలై 1 నుంచే వస్తుసేవల పన్ను అమల్లోకి
► జీఎస్టీ అమలుకు అంతా సిద్ధమైందన్న జైట్లీ
► 80 శాతానికి పైగా కంపెనీల రిజిస్ట్రేషన్ పూర్తి
► యాంటీ–ప్రాఫిటీరింగ్ చర్యలపై ఐదుగురు సభ్యుల అథారిటీ
► కొత్త ఈ–వే బిల్లు నిబంధనలు వచ్చేవరకు పాత విధానమే
న్యూఢిల్లీ: జూలై 1 నుంచే దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసేందుకు జీఎస్టీ మండలి ఆదివారం ఏకగ్రీవంగా ఆమో దం తెలిపింది. జూన్ 30 అర్ధరాత్రినుంచే జీఎస్టీ అమల్లోకి వస్తుందని.. కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి చైర్మన్ అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలు మినహా.. మిగలిన వ్యవస్థ అంతా సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలును వాయిదావేసేందుకు దేశం వద్ద తగిన సమయం లేదన్నారు.
ఆదివారం ఢిల్లీ లో జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. రోజుకు రూ.5000 అంతకన్నా ఎక్కువ రేటు ఉన్న హోటళ్ల ఏసీ గదులపై ఉన్న 28 శాతం జీఎస్టీ పన్నురేటును మార్చారు. రూ.7,500 ఆపై గదులకు ఈ రేటును అమలు చేయనున్న ట్లు జైట్లీ వెల్లడించారు. రూ.2,500–రూ. 7,500 వరకు రేట్లను 18 శాతం పరిధిలోకి చేర్చారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలోని రెస్టారెంట్ సేవలపై 18 శాతం పన్ను ఉంటుంది. లాటరీలను రెండు విభాగాలుగా విభజించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రభుత్వ లాటరీ సంస్థలపై 12 శాతం, ప్రైవేటు (ప్రభుత్వ అనుమతి ఉన్న) లాటరీలను 28 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.
జోరుగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు
ఈ 17వ జీఎస్టీ మండలి సమావేశంలో యాంటీ–ప్రాఫిటీరింగ్ సహా మిగిలిన నిర్ణయాలకు కూడా జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ‘చాలా కంపెనీలు, వాణిజ్య సంస్థలు జీఎస్టీకి సన్నద్ధంగా లేమని ఈ పన్ను విధానాన్ని వాయిదా వేయాలని కోరుతున్నాయి. కానీ మావద్ద జీఎస్టీని వాయిదా వేసేందుకు తగిన సమయమేదీ లేదు. ఇప్పటికే 80 శాతానికి పైగా కంపెనీలు, సంస్థలు జీఎస్టీలో రిజిస్టర్ చేసుకున్నాయి’ అని సమావేశం వివరాలను జైట్లీ వెల్లడించారు.
పాత వ్యవస్థ ప్రకారం 80.91 లక్షల సంస్థలుండగా వీటిలో కొన్నింటికి జీఎస్టీలో మినహాయింపు ఉంది. మిగిలిన సంస్థల్లో ఇప్పటికే 65.6 లక్షల కంపెనీలు రిటర్న్స్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్‌ను ఎలాంటి సమస్యల్లేకుండా పూర్తిచేసుకున్నాయని జైట్లీ తెలిపారు. ‘వ్యాపారులు మైగ్రేషన్ కోసం బారులు తీరి హడావుడి పడాల్సిన పనేం లేదు. జీఎస్టీ గుర్తింపు నంబరు (జీఎస్టీఐఎన్) పొందేందుకు మీకు 30 రోజుల సమయం ఉంది’ అని మంత్రి తెలిపారు.
కొన్ని సంస్థలు కొత్తగా జీఎస్టీ పరిధిలోకి రానున్నాయన్నారు. జూన్ 15న రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ.. జూన్ 25న మళ్లీ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారిలో ఇంతవరకు ఒక్కరు కూడా సమస్యలున్నాయని ఫిర్యాదు చేయలేదన్నారు. కాగా, తమిళనాడు, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు మాత్రమే ఇంతవరకు జీఎస్టీ చట్టాన్ని అమలుచేసే అవసరమైన విధివిధానాలను పూర్తిచేయలేదని జైట్లీ వెల్లడించారు.
కొత్త నిబంధనలు వచ్చేంతవరకు..
ఈ–వే బిల్లు (జీఎస్టీ నెట్‌వర్క్ పోర్టల్ ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రానిక్ వే బిల్లు)లపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పటికే ఈ–వే బిల్‌ను కలిగున్న రాష్ట్రాలు అదే విధానాన్ని కొనసాగించనుండగా.. మిగిలిన రాష్ట్రాలకు దీన్నుంచి మినహాయింపునిచ్చారు. ‘ఈ–వే బిల్లులపై పూర్తిస్థాయి నిబంధనలు రూపొందించేంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే కొనసాగుతుంది’ అని జైట్లీ వెల్లడించారు. రూ.50వేలకు పైగా విలువైన వస్తువులకు ఈ–వే బిల్లు లేకుండా తరలించే అవకాశం ఉండదు.
యాంటీ–ప్రాఫిటీరింగ్‌పై అథారిటీ
జీఎస్టీ మండలి ఆదివారం యాంటీ–ప్రాఫిటీరింగ్ నిబంధనలకు ఆమోదం తెలిపింది. యాంటీ–ప్రాఫిటీరింగ్ (జీఎస్టీ అమలు వల్ల తగ్గిన ధరలతో కలిగే లాభాన్ని వినియోగదారులకు పంచటం)ను అమలుచేయని సంస్థలు, కంపెనీలకు జరిమానా విధించేందుకు ఐదుగురు సభ్యుల (అధికారులు)తో అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిటైర్డ్ సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ కమిటీ.. ఫిర్యాదులపై, సుమోటోగానూ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.
సేల్స్ రిటర్న్స్ నిబంధనల సడలింపు
జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాపారస్తులు దాఖలు చేయాల్సిన సేల్స్ రిటర్న్స్‌కు తొలి రెండు నెలలపాటు సడలింపు ఇస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. సవరించిన రిటర్న్స్ ఫైలింగ్ నిబంధనల ప్రకారం జూలై నెలకు సంబంధించిన సేల్స్ రిటర్న్స్ ఆగస్టు 10వ తేదీన దాఖలు చేయాల్సి ఉండగా.. వీటికి సెప్టెంబర్ 5 వరకు గడువిచ్చారు. సెప్టెంబర్ 10 లోపు దాఖలు చేయాల్సిన ఆగస్టు రిటర్న్స్‌కు 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ‘జీఎస్టీపై పూర్తి సన్నద్ధత లేని కారణంగా జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చాం. సెప్టెంబర్ నుంచి అంతా యథావిధిగానే కొనసాగుతుంది’ అని జైట్లీ స్పష్టం చేశారు.