
జీఎస్టీతో సానుకూల ఫలితాలు: జైట్లీ
న్యూఢిల్లీ: జీఎస్టీతో (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) సానుకూల ఫలితాలు వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వ మూడేళ్ల పాలనపై ఆయన గురువారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. వృద్ధిరేటు 7 నుంచి 8 శాతంగా ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైందని, ఎంత డబ్బు వెనక్కి వచ్చిందనేది త్వరలో లెక్కతేలుతుందన్నారు.
నియంత్రణ రేఖ వెంబడి భారత్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, దక్షిణ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని అరుణ్ జైట్లీ అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇక గోవధ నిషేధంపై తాము కొత్తగా చట్టమేమీ చేయలేదన్నారు. రాష్ట్ర చట్టాలకు లోబడే పశువుల విక్రయంపై కొత్త నిబంధనలు తెచ్చామని జైట్లీ పేర్కొన్నారు. కాగా దేశంలోని రాష్ట్రాలన్నీ దాదాపుగా ఆమోదించటంతో... జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవటానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది.