ఈబీసీల 10 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్సును కొట్టేసిన హైకోర్టు
అహ్మదాబాద్: గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ! ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీలు)కు గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం కోటా ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా ఈ ఆదేశాల అమలుపై హైకోర్టు రెండు వారాలు స్టే విధించింది. పటేళ్ల ఆందోళన చల్లార్చేందుకు ఈబీసీలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే నెలలో గుజరాత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. కుటుంబ వార్షికాదాయం రూ. ఆరు లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపినకోర్టు ఈబీసీ కోటాను రద్దు చేస్తూ, ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం
ఈ ఆర్డినెన్సు వల్ల రిజర్వేషన్ లేని వర్గాలకు సీట్లు తగ్గిపోతాయని.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశానికి ఇది వ్యతిరేకమన్న పిటిషనర్ల వాదనను కోర్టు సమర్థించింది. అయితే రిజర్వేషన్లు లేని వర్గాలను మరింతగా వర్గీకరించి ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తామని పేర్కొంది. కాగా, కోర్టు ఆదేశాలను పటేళ్ల నేత హార్దిక్ పటేల్ స్వాగతించారు. ‘మేం రాజ్యాంగం ప్రకారం కోటా పొందాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు
గుజరాత్ సర్కారుకు ఎదురుదెబ్బ
Published Fri, Aug 5 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement
Advertisement