నోట్ల రద్దు: ఆలయాల పెద్ద మనసు
వందనోట్లు, ఇతర చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యులను ఆదుకోడానికి భగవంతుడే దిగి రానక్కర్లేదు.. ఆలయాలు ఆ పని చేసినా చాలు.
వంద నోట్లు, ఇతర చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యులను ఆదుకోడానికి భగవంతుడే దిగి రానక్కర్లేదు.. ఆలయాలు ఆ పని చేసినా చాలు. ఇన్నాళ్లుగా భక్తులు హుండీలలో విరాళాల రూపంలో వేసిన చిన్న నోట్లను ప్రజలకు అందించేందుకు వీలుగా.. గుజరాత్‌లోని పెద్ద ఆలయాలు ముందుకొచ్చాయి. అక్కడి ప్రముఖ దేవాలయాలైన అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయాలు తమకు ప్రతిరోజూ వస్తున్న చిన్న నోట్లను అన్నింటినీ బ్యాంకులలో జమ చేస్తున్నాయి. దాంతో బ్యాంకులు వాటిని తిరిగి ప్రజలకు అందిస్తున్నాయి.
500, 1000 రూపాయల పాత నోట్లను మార్చుకోడానికి తీసుకొచ్చేవాళ్లు ఇవ్వడం లేదా ఏటీఎంలలో పెట్టించడం ద్వారా వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. తమకు వచ్చిన విరాళాలు అన్నింటినీ ఏరోజుకారోజే బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఒక ఉత్తర్వు కూడా జారీ చేయడంతో అక్కడి సామాన్యలు కష్టాలు కొంతవరకు తగ్గాయి. అహ్మదాబాద్‌లోని భద్రకాళి ఆలయానికి మామూలుగా అయితే భక్తులు రోజూ పెద్దసంఖ్యలోనే వస్తారని, కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత వారి సంఖ్య కొంతవరకు తగ్గిందని ఆలయ ట్రస్టీ శక్తికాంత తివారీ చెప్పారు. అయితే శుక్రవారం మాత్రం భక్తులు యథాతథంగా భారీ సంఖ్యలోనే వెల్లువెత్తుతున్నారన్నారు.