గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో రఘువీర్ చౌదరి 51వ వారు. ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ సెలెక్షన్ బోర్డు చైర్మన్ సురంజన్ దాస్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ప్రొఫెసర్ షమిమ్ హనిఫ్, హరీశ్ త్రివేది, రామకాంత్ రాత్, చంద్రకాంత్ పాటిల్, అలోక్‌రాయ్, దినేశ్‌మిశ్రా, లీలాధర్ మంద్లోయి పాల్గొన్నారు.ఆయన గుజరాతీలో పలు రచనలు చేశారు. రఘువీర్ చౌదరి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.
గుజరాతీ సాహిత్యానికి వన్నె తెచ్చిన రచయిత
1938లో జన్మించిన రఘువీర్ చౌదరికి గుజరాతీ సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. నవలాకారుడిగా, కవిగా, విమర్శకుడిగా గుజరాతీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వ్యక్తి ఆయన. ఆయన ప్రభావం ఎంతోమంది గుజరాతీ రచయితలపై ఉంది. గోవర్ధన్‌రాం త్రిపాఠి, కాకా కలేల్కర్, సురేశ్ జోషి, రామాదర్శ మిశ్రా, జీఎన్ డిక్కీ వంటి రచయితలు ఆయన రచనలతో ప్రభావితమైన వాళ్లే. భావవ్యక్తీకరణ గంభీరత, అర్థవంతమైన ఉపమాలు, ప్రతీకల ప్రయోగం రఘువీర్ కవిత్వంలో ప్రముఖంగా కనిపిస్తుంది.
కవిత్వమే ఆయనకు అత్యంత ప్రీతికరమైనదైనా.. నవలా సాహిత్యంలో నిరంతర అన్వేషి ఆయన. మానవ జీవిత నిత్య ప్రవర్ధమాన కార్యకలాపాలను ప్రగతిశీల దృక్పథంతో బలోపేతం చేయడం ఆయన దృక్పథంగా కనిపిస్తుంది. ఆయన నవలలు 'అమృత', 'వేణు వాత్సల', 'ఉపర్వస్' త్రయంలో ఇదే దృక్పథం ప్రతిధ్వనిస్తుంది. ఆయన రచించిన 'రుద్ర మహాలయ' గుజరాతీ సాహిత్యంలోనే విఖ్యాత రచనగా నిలిచిపోయింది. సృజనాత్మక రచించడం, విభిన్నంగా ఆలోచనను ఆవిష్కరించే విషయంలో ఆయన రాసిన వ్యాసాలు ఆయన సునిశిత దృష్టిని చాటుతాయి.