బెంగళూరులో గుజరాత్ ఎమ్మెల్యేలు
44 మందిని తరలించిన కాంగ్రెస్
సాక్షి, బెంగళూరు/అహ్మదాబాద్: గుజరాత్‌లో ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బెంగళూరు సమీపంలోని రిసార్ట్‌కు తరలించింది. తమ ఎమ్మెల్యేలకు వలవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీంతో 44 మందిని బెంగళూరు తరలించినట్టు గుజరాత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిషిత్ వ్యాస్ చెప్పారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేలతో బెంగళూరులోనే ఉన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీకి ప్రస్తుతం 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ చీఫ్ అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ రాజ్యసభ బరిలో ఉన్నారు. ఇటీవల ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వారిలో ముగ్గురు శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ ఫిరాయించాలని వస్తున్న బెదిరింపుల నుంచి ఎమ్మెల్యేలను రక్షించేందుకే వారిని బెంగళూరు తరలించామని వ్యాస్ చెప్పారు. ఈ ఆరోపణలను గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ ఖండించారు. కాగా, ఏడుగురు ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లేందుకు నిరాకరించినట్టు తెలిసింది.
వీరిలో ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన వాఘేలా, ఆయన కుమారుడు మహేంద్రసిన్హ్ వాఘేలా తదితరులు ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల ఎమ్మెల్యేలను అక్కడికి తరలించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు నగరానికి 50 కి.మీ. దూరంలోని ఓ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచినట్లు వ్యాస్ తెలిపారు. కాగా, వాఘేలాకు సన్నిహితుడైన రాఘవ్‌జీ తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతానని ప్రకటించారు. త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పారు.
ఎన్డీఏ వచ్చాకే రాష్ట్రాల్లో అశాంతి: రాహుల్
జగదల్‌పూర్: కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కశ్మీర్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో అశాంతి నెలకొందని, దీనికి ఎన్డీఏ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, చైనా, పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేలా ఎన్డీఏ పాలన సాగుతుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అశాంతి పెరిగిపోతోందని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.