
టార్గెట్ ఒకరు...బలైంది మరొకరు
ఢిల్లీ: గుర్గావ్లో జరిగిన గ్యాంగ్వార్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ హత్యకేసులో నిందితుడిని హత్యచేసేందుకు పథకం రచించారు కొంతమంది దుండగులు. బుధవారం ఉదయం దేశ రాజధానినగరం నడివీధిలో కాల్పులకు తెగబడ్డారు. అయితే అతను ఈ దాడినుంచి తృటిలో తప్పించుకోగా ఈ ఘటనతో సంబంధంలేని ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బుల్లెట్ దిగడంతో సదరు నిందితుడు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెడితే హత్యకేసులో నిందితుడుగా ఉన్నవ్యక్తి విచారణ నిమిత్తం కోర్టుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను కాల్పులను తప్పించుకునే ప్రయత్నంలో వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపుతప్పి, ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు కాల్పులు జరిపిన అయిదుగురు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్ రిజిష్టర్ నెంబరు ఉన్న సాంత్రో కారులో వచ్చినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నారు.