టాయ్‌లెట్ కడితేనే తుపాకీ లైసెన్స్!
రాజ్‌గఢ్: తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇంట్లో మరుగుదొడ్డి (టాయ్‌లెట్) లేకున్నా తుపాకీ అవసరమా? అంటూ అతని దరఖాస్తును తిరస్కరించారు. ముందు ఇంట్లో టాయ్‌లెట్ నిర్మించి.. ఆ తర్వాతే తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీ లైసెన్స్ కోసం రూ. 50 వేలు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి మరుగుదొడ్డి కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయలేరా అని జిల్లా కలెక్టర్ తరుణ్ పిథోడ్ ప్రశ్నించారు.
అంతేకాకుండా ఇకపై ఎవరైనా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా వారింట్లో టాయిలెట్ ఉండాలని, అలా ఉంటేనే ఆ దరఖాస్తులను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. రాజ్ గఢ్ ప్రాంతంలో ఆయుధ లైసెన్స్ ను కలిగి ఉండటం గౌరవంగా భావిస్తున్నారు. ఇక్కడ ఏడాదికి 700 గన్ లైసెన్స్ దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.