హరియాణాలో హై అలర్ట్‌ | Gurmeet Ram Rahim Singh convicted of rape | Sakshi
Sakshi News home page

హరియాణాలో హై అలర్ట్‌

Published Mon, Aug 28 2017 12:56 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

హరియాణాలో హై అలర్ట్‌

హరియాణాలో హై అలర్ట్‌

నేడు డేరా చీఫ్‌ గుర్మీత్‌ సింగ్‌కు శిక్ష ఖరారు
► రోహ్‌తక్‌ జైలుకు హెలికాప్టర్‌లో వెళ్లనున్న న్యాయమూర్తి
►  హింసపై హెచ్చరించిన ఇంటెలిజెన్స్‌.. అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం
► 144 సెక్షన్‌ అమలు.. పటిష్టమైన భద్రత ఏర్పాటు
► హరియాణాలో నేడు విద్యాసంస్థలకు సెలవు.. రేపటి వరకు ఇంటర్నెట్‌పై నిషేధం  


చండీగఢ్‌: డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌ (50)కు అత్యాచారం కేసులో నేడు శిక్ష ఖరారు కానుంది. రోహ్‌తక్‌ జిల్లా సునరియా జైల్లో ఉన్న గుర్మీత్‌కు జైలు గోడల మధ్యే సీబీఐ కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించనున్నారు. 2002 నాటి ఓ అత్యాచార కేసులో డేరా చీఫ్‌ను సీబీఐ కోర్టు శుక్రవారం దోషిగా ప్రకటించటం.. అనంతరం హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో అతని అభిమానులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోర్టు హాల్లో కాకుండా జైల్లోనే గుర్మీత్‌కు శిక్ష ఖరారుచేయాలని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నిర్ణయించారు. ఇందుకోసం జైల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచకుల నుంచి న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ను ప్రత్యేక హెలికాప్టర్‌లో సునరియా జైలుకు తీసుకెళ్లనున్నారు. శుక్రవారం నాటి తీర్పు అనంతరం డేరా అభిమానుల ఉన్మాదకాండలో మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరింది.  

హింసపై ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక
గుర్మీత్‌సింగ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హరియాణాలో హింస చెలరేగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఈ గొడవలు కొన్నిరోజులపాటు కొనసాగే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో శిక్ష ప్రకటించాక మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

పంచకుల, సిర్సాలతోపాటుగా రోహ్‌తక్‌ చుట్టుపక్కన ప్రాంతాల్లోనూ 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. గుర్మీత్‌ సింగ్‌ను విడిపించేందుకు ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జైలుకు వెళ్లే మార్గాల్లోనూ అంచెలంచెలుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రోహ్‌తక్‌ రేంజ్‌ ఐజీ నవ్‌దీప్‌ విర్క్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శని, ఆదివారాల్లో హరియాణా, పంజాబ్‌లలో ఎక్కడా గొడవలు జరగలేదని ఆయన తెలిపారు. తీర్పు నేపథ్యంలో ఢిల్లీలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.  

గుర్మీత్‌ను తప్పించే యత్నం
పంచకుల కోర్టులో శుక్రవారం తీర్పు వెలువడిన తర్వాత గుర్మీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన్ను తప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఏడుగురు గుర్మీత్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని దేశద్రోహం, హత్యాయత్నం కేసుల కింద పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు హరియాణా పోలీసులు కూడా ఉన్నారు. సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంతో (మహిళలు, చిన్నారులు సహా లక్షమంది ఉంటారని అంచనా) పాటుగా వివిధ ఇతర కేంద్రాల్లో ఉన్న మద్దతుదారులు, అభిమానులను వారి ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. డేరా కేంద్రాలన్నింటినీ ఖాళీ చేయాలని ఆర్మీ, పారామిలటరీ బలగాలు ఆదేశించాయి.

శిక్ష ప్రకటించాకే సోదాలు
శిక్ష ఖరారు నేపథ్యంలో హరియాణాలో సోమ వారం విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. హరియాణా, పంజాబ్‌ల్లోని పలు ప్రాంతాల్లో నిలిపేసిన మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.30 వరకు నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సిర్సా మినహా పలు ప్రాంతాల్లో కొంతసేపు కర్ఫ్యూను సడలించారు. డేరా సచ్చా సౌదా అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గుర్మీత్‌కు శిక్ష పడిన తర్వాతే డేరా ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement