పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ (22) సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఉండకూడదన్న షరతుతో గుజరాత్ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం 7.30 గంటలకు విరమ్‌గ్రామ్ నుంచి ఉదయ్‌పూర్‌కు హార్దిక్ బయలుదేరి వెళ్లారని ఆయన సన్నిహితుడు దినేశ్ బంభనియా చెప్పారు.
అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పటేళ్ల నాయకుడు పుష్కర్‌లాల్ పటేల్‌కు చెందిన ఓ ఇంట్లో హార్దిక్ ఆరు నెలల పాటు ఉండనున్నారు. దేశద్రోహం, విస్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన హింసకు సంబంధించిన కేసులో అరెస్టయిన పటేల్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, పటేళ్ల వర్గ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వెళ్తానని హార్దిక్ పటేల్ సంకేతాలివ్వడంతో 2017 లో జరగనున్న ఎన్నికల దష్ట్యా అనేక ప్రతిపక్ష పార్టీలు హార్దిక్‌ను చేర్చుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 18 శాతమున్న పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలని హార్దిక్ డిమాండ్ చేస్తున్నారు.